30 జూన్, 2012

పూరీ జగన్నాధ్ సాధించిన అరుదైన రికార్డు
ఒక్కో సినిమాని రెండేసి సంవత్సరాలు తీస్తూ బడ్జెట్ లు పెంచుకుంటూ ఎప్పుడు రిలీజో తెలియని స్ధితిలో తెలుగు దర్శకులు కొట్టు మిట్టాడుతున్నారు. ఈ టైమ్ లో పూరీ జగన్నాధ్ తను మొదటి అనుకున్న బడ్జెట్ పరిమితులలో,డేట్స్ ఒక్క రోజు కూడా ఎక్కువ కాకుండా,మెదటే ఫిక్స్ చేసుకున్న విడుదల తేదీకి సినిమాలు విడుదల చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ ప్లానింగ్ ఈ సంవత్సరం నలుగురు స్టార్ హీరోలతో సినిమాలు చేసి అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నారు.

సంవత్సరం ప్రారంభంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో బిజినెస్ మ్యాన్ చిత్రం చేసి హిట్ కొట్టాడు. ఆ తర్వాత రవితేజతో దేముడు చేసిన మనుష్యులు చిత్రం ప్రకటించిన,జనాలుకు సింక్ అయ్యేలోగా విడుదలకు సిద్దం చేసేసాడు. జూలై 29 న చిత్రం విడుదల అవుతోంది. ఇప్పుడు పవన్ తో కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం చేస్తున్నాడు. అది కూడా నాలుగు నెలల్లో రెడీ చేసి విడుదల చేస్తానని అక్టోబర్ 18 డేట్ ఇచ్చేసాడు. దానితో సరిపెట్టకుండా అల్లు అర్జున్ తో చిత్రం ప్లాన్ చేసి డిసెంబర్ 21న విడుదల చేస్తానని డేట్ ప్రకటించేసారు.

ఇలా మహేష్ బాబు,పవన్ కళ్యాణ్,రవితేజ,అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో కథలు చెప్పి ఒప్పించి సినిమాలు పూర్తి చేసి విడుదల చేయటం,అదీ ఒక సంవత్సరంలో ఈ నాలుగు సినిమాలు విడుదల కావటం ఇండస్ట్రీ జనాలుకు షాక్ ఇస్తోంది. ఏ దర్శకుడూ కలలో కూడా ఊహించని విధంగా పూరీ తన కెరీర్ ని చాలా డిఫెరెంట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. అందరూ పూరీ పని అయిపోయిందనుకున్న టైమ్ లో బిజినెస్ మ్యాన్ తో సూపర్ హిట్ ఇచ్చి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు.

అప్పట్లో దాసరి,రాఘవేంద్రరావు,కోడి రామకృష్ణ వంటి పెద్ద డైరక్టర్స్ మాత్రమే ఇలా కంటిన్యూగా స్టార్ హీరోలతో సినిమాలు చేసి విడుదల చేసేవారు. ఇప్పుడా అరుదైన రికార్డుని పూరి సాధించాడు. ఇలా స్పీడుగా సినిమాలు చేయటం వల్ల పరిశ్రమలో చాలా మందికి పనులు దొరకుతాయని, హిట్ పర్శంటేజ్ పెరుగుతుందని సీనియర్స్ అంటున్నారు. అయితే కొందరు దాని వల్ల క్వాలిటీ సినిమాలు వచ్చే అవకాశం లేదని విమర్శిస్తున్నా...సంవత్సరాల తరబడి తీసిన సినిమాలు సైతం భాక్సాపీస్ వద్ద డిజాస్టర్ గా ఫలితం సాధించిన విషయం గుర్తు చేసుకోవాలి.