10 జూన్, 2012

రేప్పొద్దుటే కేసీఆర్ వస్తడు.. తెలంగాణ కోసం మెడ కోసుకుంటనంటడు... కొండా

                                          
పరకాలలో కొండా సురేఖ తెరాస చీఫ్ కేసీఆర్ పైనే టార్గెట్ పెట్టారు. పరకాల రోడ్ షోలో కేసీఆర్‌ను తూర్పారబట్టారు. ఈ రోడ్ షోకు వచ్చిన జనాన్ని చూసి రేప్పొద్దుటే కేసీఆర్ ఇక్కడకు వస్తడు... తెలంగాణ కోసం తన మెడ కోసుకుంటనంటడని తనదైన శైలి ధ్వజమెత్తారు. 

ఆమె కాంగ్రెస్ - తెదేపాలను విమర్శించింది బహు తక్కువే. కేసీఆర్ తెలంగాణ తెస్తానని 800 మంది విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకున్నారని మండిపడ్డారు. అసలు తెలంగాణ ఎలా తేగలరో చెప్పలేని కేసీఆర్ దాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడని విమర్శించారు. 

కేసీఆర్ తెలంగాణ తెస్తానని 11 ఏళ్లుగా చెపుతున్నాడనీ, ఇప్పుడు ఇక్కడ భిక్షపతిని గెలిపిస్తే 3 నెలల్లో తెలంగాణ తెస్తనని అంటాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వల్ల తెలంగాణ రాదని ఇప్పటికే తేలిపోయిందనీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వస్తే తన పార్టీ బలహీనమై పోతుందని కేసీఆర్‌కు భయం పట్టుకున్నదని ఆమె ఆరోపించారు. తెలంగాణ ఎలా తెస్తడో చెపితే ఈ క్షణమే పోటీ నుంచి తప్పుకుని తెరాసకు తన ఓటు కూడా వేస్తానని ఆమె సవాల్ విసిరారు.