29 జూన్, 2012

గాల్లోకి కాల్పులు: విశాఖ జిల్లా ఎన్టీపిసి వద్ద ఉద్రిక్తం
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని ఎన్టీపిసి సముద్ర జెట్టీ వివాదం మళ్లీ ఉద్రిక్తతకు దారి తీసింది. ఎన్టీపిసి పంప్ హౌస్ వద్ద చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గురువారం ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విశాఖపట్నం జిల్లాలోని పరవాడ మండలం తిక్కవానిపాలెం గ్రామం వద్ద ఉన్న ఎన్టీపిసి యాష్ పాండ్ వద్ద మత్స్యాకారుల కుటుంబాలు ఆందోళనకు దిగాయి. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ మత్స్యకారులు ఆందోళనకు దిగారు.

ఆందోళనకారులు, సిఐఎఎస్ఎఫ్ సిబ్బంది పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఆందోళనకారులపై లాఠీచార్జీ చేశారు. ఆరు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఘర్షణలో విఆర్‌వోతో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. ఓ వ్యక్తి తలకు బుల్లెట్ గాయమైంది. అతన్ని ఆస్పత్రికి తరలించారు. మీడియా ప్రతినిధులపైకి కూడా సిఐఎస్ఎఫ్ సిబ్బంది రాళ్లు రువ్వారు.

ఎన్టీపిసి వద్ద ఉన్న బూడిద కాలువకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. తరుచుగా స్థానికులు దానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. గురువారం మరోసారి వారు ఆందోళన చేసినప్పుడు పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. ఎన్టీపిసికి చుట్టుపక్కల దాదాపు 40 గ్రామాలుంటాయి. అవన్నీ జాలర్ల కుటుంబాలే.

ఎన్టీపిసి బూడిద కాలువ వల్ల ఆ గ్రామాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఊపిరితిత్తుల సమస్యతో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కుంటున్నారు. చిన్నపిల్లల పరిస్థితి దారుణంగా ఉంటోంది. దాంతో తమను సురక్షిత ప్రాంతాలకు తరలించి, ఉపాధి కల్పించాలని జాలర్లు డిమాండ్ చేస్తున్నారు. నలభై గ్రామాల ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించడం అంత సులభం కాదు. కానీ, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం వారికి ఎప్పటికప్పుడు హామీలు ఇస్తూ కూడా అమలు చేయడం లేదు.