29 జూన్, 2012

మరోసారి తండ్రైన మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్‌బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతులకు పాప పుట్టింది. నమ్రత గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ పాప మహేష్‌బాబుకు రెండో సంతానం. ఆయనకు ఇప్పటికే గౌతమ్ అనే కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు రూపొందిస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం షూటింగులో పాల్గొంటునున్నారు.

వెంకటేష్,మహేష్ కాంబినేషన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రం గురించి నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...విరగబూసిన సిరిమల్లె చెట్టుని ఆ పూట సీతమ్మకి అంకితం చేశారు. కొమ్మ కదలకుండా పూలు కోశారు. కోసిన పూలన్నీ వాలుజడకి చుట్టారు. సీతమ్మ సింగారం వెనక అసలు కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు దిల్‌ రాజు.

అలాగే తెలుగుదనం ఉట్టిపడే కథ ఇది. మన ఇంట్లో జరుగుతున్నట్టే అనిపిస్తుంది. అన్నదమ్ములుగా ఇద్దరు కథానాయకులు ఒదిగిపోయిన విధానం చాలా బాగుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి చక్కటి స్పందన లభించింది. ఇంటర్నెట్‌లో ఆ పాట బిట్‌ చాలామంది వీక్షిస్తున్నారు అన్నారు. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో సాగే కథే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. కథలో భావోద్వేగాలు అందరినీ కదిలిస్తాయి. వెంకటేష్‌, మహేష్‌బాబుల పాత్రలు అందరికీ గుర్తుండిపోతాయి. సీత పాత్ర కథలో చాలా కీలకం. ప్రకాష్‌రాజ్‌ మరోసారి ఓ ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారు. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఈ సినిమా నాంది అవుతుంది అన్నారు.

అలాగే మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దూకుడు చిత్ర నిర్మాతలైన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలు 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్‌పై రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు గతంలో ఎన్నడూ లేని విధంగా యంగ్ అండ్ డైనమిక్‌గా, వయసు చాలా తక్కువ ఉన్న కుర్రాడిలా కనిపించబోతున్నాడు. ఇందు కోసం మహేష్ ప్రత్యేకంగా వర్కౌట్లు చేయడంతో పాటు స్పెషల్ డైట్ తీసుకుంటున్నాడు.

ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కాజల్ నటిస్తోంది. ఇందులో మహేష్ కాలేజీలో లెక్చరర్ గా కనిపిస్తారు. సుకుమార్ తన దైన శైలిలో కాలేజి సీన్స్ రాసుకున్నారని వినపడుతోంది. పూర్తి ఫన్ తో కాలేజీ లెక్చరర్ కీ,స్టూడెంట్స్ కీ మధ్య నడిచే కథతో ఈ చిత్రం రూపొందుతోందని చెప్తున్నారు. సుకుమార్ గతంలో లెక్చరర్ గా చేసిన సంగతి తెలిసిందే.