28 జూన్, 2012

సూపర్ స్టార్ కృష్ణను జూ ఎన్టీఆర్ మరిపిస్తాడా?
తెలుగులో జేమ్స్ బాండ్ సినిమాలంటే మనకు ముందుగా గుర్తొచ్చేది సూపర్ స్టార్ కృష్ణ. అసలు జేమ్స్ బాండ్ సినిమాలు తెలుగు వారికి పరిచయం చేసిందే ఆయన. కృష్టా బాడీ లాంగ్వేజ్, నటన ఆ పాత్రలకు బాగా సూటయ్యేవి. అప్పట్లో కృష్ణ నటించిన జేమ్స్ బాండ్ సినిమాలకు మహా క్రేజ్ ఉండేది కూడా. అందుకే ఆయన జేమ్స్ బాండ్ హీరో అయ్యారు.

ఆ తర్వాత చాలా మంది తెలుగు హీరోలు జేమ్స్ బాండ్ తరహా పాత్రలు ట్రై చేసినా ఎవరూ సక్సెస్ కాలేదు. కృష్ణ వారసత్వం పునికి పుచ్చుకున్న మహేష్ బాబు ఈ పాత్రలకు బాగా సూట్ అవుతాడనే ఆలోచనలతో దర్శకులు సురేందర్ రెడ్డి, మొహర్ రమేష్‌లు ఆ తరహా కథలతో మహేష్ బాబును సంప్రదించినా ఆయన పెద్దగా ఇంట్రస్టు చూపలేదు.

అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం జేమ్స్ బాండ్ పాత్రలను అంగీకరించడంలో ముందు ఉన్నాడు. ప్రస్తుతం జూ ఎన్టీఆర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో నటిస్తున్న ‘బాద్ షా' చిత్రంలో బాండ్ పాత్రలో కనిపించనున్నాడు. మరి ఇకపై జేమ్స్ బాండ్ సినిమా అంటే సూపర్ కృష్ణ కాదు జూ ఎన్టీఆర్ అని అనేలా జూనియర్ తన టాలెంట్ చూపిస్తాడా? లేక తర తరాలుగా కృష్ణ రేంజిని అందుకోలేక చతికిలపడ్డ హీరోల జాబితాలో జూనియర్ కూడా చేరుతాడా? అనేది భవిష్యత్‌లో తేలనుంది.

ఇప్పటికే రెడీ, దూకుడు లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీను వైట్ల ఈ సారి అంతకు మించిన ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుతో ‘బాద్ షా' చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ ‘బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని,ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.