14 జూన్, 2012

సినీ పెద్దల చుట్టూ సిఐడి ఉచ్చు?

                                          Cid Arrest Singanamala C Kalyan
మద్దెలచెర్వు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌తో కలిసి సెటిల్‌మెంట్లు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ పెద్దల చుట్టూ సిఐడి ఉచ్చు బిగిస్తోంది. తుపాకీ గురిపెట్టి తనను బెదిరించారని, కొన్న సినిమా బాక్సులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని డిస్ట్రిబ్యూటర్, నిర్మాత నట్టి కుమార్ ఇటీవల సిఐడికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన సిఐడి అధికారులు సి కల్యాణ్, భాను కిరణ్, శింగనమల రమేష్, వ్యాపారవేత్త ఆంజనేయ గుప్తాలపై ఈనెల 7నకేసు నమోదు చేశారు.
2010 సెప్టెంబర్ 6న శంఖం సినిమాకు సంబంధించి నట్టి కుమార్‌ను సి కల్యాణ్‌కు చెందిన బాలాజీ కలర్‌ ల్యాబ్‌కు పిలిపించి తుపాకీతో బెదిరించారంటూ కేసు నమోదైంది. రూ.3 కోట్ల పెట్టుబడి పెట్టిన తనకు వీరి బెదిరింపుల కారణంగా రూ.7.5 లక్షలే అందిందని సిఐడి పోలీసులకు నట్టి కుమార్ ఫిర్యాదు చేశారు. 2009 సెప్టెంబర్ 8న పోలీసు పోలీసు అనే సినిమాకు సంబంధించి ఫిల్మ్ ఛాంబర్‌లో తనను తుపాకితో బెదిరించారని సి కల్యాణ్, భాను కిరణ్, వెంకటేశ్వర రావులపై నట్టి మరో ఫిర్యాదు చేశారు.
వీరిపై హత్యాయత్నంతో పాటు ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు. సిఐడి అరెస్టు ఖాయమని భావించిన నిందితులు ముందస్తు బెయిలు కోసం యత్నాలు ముమ్మరం చేశారు. కాగా విశాఖపట్నంలో ఉన్న నట్టి కుమార్‌ను హైదరాబాద్ రప్పించి రాజీ చేసేందుకు సినీ పెద్దలు రంగంలోకి దిగారట. వీరి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారట. అప్పుడు నట్టి కుమార్ నష్టపోయిన సొమ్ము ఇప్పుడు చెల్లించేలా రాజీ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.
కాగా సిఐడి అధికారులు రోజుకో సినీ నిర్మాతను పిలిపించి విచారిస్తున్నారు. బెదిరింపుల కేసులో మంగళవారం సినీ నిర్మాత భగవాన్‌ను పిలిపించిన సిఐడి అధికారులు ఆయనను ప్రశ్నించి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. బుధవారం దరువు సినిమా నిర్మాత శివ రామ కృష్ణను పిలిపించి మూడు గంటల పాటు ప్రశ్నించారు.