13 జూన్, 2012

‘ఎందుకంటే ప్రేమంట’లో ఆత్మ విషయమై దర్శకుడి వివరణ


                                      Endukante Premanta Film Result
ఈ సినిమాని మెదడుతో కాదు... మనసుతో చూడాలి. అప్పుడు లాజిక్కులు వెతికే అవసరం ఉండదు. చనిపోకుండా ఆత్మ ఎలా వస్తుంది? అనేది చాలామంది ప్రశ్న. చనిపోతే ఏం అవుతారనేది ఎవరూ చెప్పలేం. మనం ఆత్మ అని నమ్ముతాం. నిరాశతో ఉన్న ఓ అమ్మాయి కోమాలోకి వెళ్లిపోతే ఆమె మనసు ఆత్మలా వస్తుందని నేను చెప్పాను అన్నారు దర్శకుడు కరుణా కరన్ . ఆయన డైరక్ట్ చేసిన తాజా చిత్రం ‘ఎందుకంటే ప్రేమంట'సక్సెస్ మీట్ ని నిర్వహించి ఇలా స్పందించారు.
అలాగే ...మరణానంతరం మాత్రమే ఆత్మ శరీరాన్ని విడుస్తుంది అనేది ఓ భావన మాత్రమే. దానికి కచ్చితమైన రుజువులు లేవు. ఇందులో కోమాలో ఉన్న కథానాయిక ఆత్మ హీరోని వెతుక్కుంటూ వస్తుంది. హీరోతో స్నేహం చేస్తుంది. గత జన్మలో తీరని తన కోర్కెను ఈ జన్మలో తీర్చుకుంటుంది. ప్రయోగాత్మకంగా తయారు చేసుకున్న కథ ఇది. సీత లక్ష్మణరేఖ దాటింది కాబట్టే రామాయణం లాంటి గొప్ప కావ్యం పుట్టింది. అలాగే కథల విషయంలో మనం కూడా కొన్ని అవరోధాలను అధిగమించాలి. అందుకే ధైర్యంతో ఈ కథ తయారు చేశాను అని తేల్చి చెప్పారు.
నిర్మాత స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ...సగటు ప్రేక్షకుల కోసమే ఈ సినిమా తీశాం. పండితుల కోసం కాదు. క్లాసిక్స్ అనదగ్గ ప్రేమకథాచిత్రాలన్నింటికీ తొలుత డివైడ్ టాకే వచ్చింది. అందుకు దేవదాసు, మూగమనసులు, గీతాంజలి సినిమాలే ఉదాహరణ. అంతెందుకు... నా ‘నువ్వేకావాలి'ని కూడా మొదట ఫ్లాప్ అన్నారు. ఇప్పుడు ‘ఎందుకంటే ప్రేమంట' కూడా అంతే. టాక్‌కి భిన్నంగా వసూళ్లను రాబడుతోందీ సినిమా. రిలీజై అయిదురోజులైంది. ఇప్పటికీ ఈ సినిమా విషయంలో అభినందనలు అందుతూనే ఉన్నాయి అన్నారు.

ఇక మార్పులు, చేర్పులు చేసి త్వరలోనే తమిళంలో విడుదల చేస్తున్నాం. అక్కడ కూడా విజయం సాధిస్తుందని మా నమ్మకం. రామ్ ఇప్పటివరకూ ఏ సినిమాలో కనిపించనంత ఎనర్జిటిక్‌గా ఈ సినిమాలో కనిపించాడు. డాన్సులు కూడా అద్భుతంగా చేశాడు. ముఖ్యంగా రామ్-తమన్నా జంట యువతరానికి విపరీతంగా నచ్చేసింది.రోజు రోజుకీ మరింత ప్రేక్షకాదరణతో ముందుకు పోతుందని ఆశిస్తున్నా అని అన్నారు. రామ్, తమన్నా జంటగా, కరుణాకరన్ దర్శకత్వంలో రవికిషోర్ నిర్మించిన చిత్రం ‘ఎందుకంటే ప్రేమంట' ఇటీవలే విడుదలైంది.