12 జూన్, 2012

బాలకృష్ణ ఊ కొట్టగానే... చాలామంది ఉలిక్కిపడ్డారు

                                                          
కొన్ని కాంబినేషన్స్ ఉలిక్కిపడేలా చేస్తాయి. ఆ కాంబినేషన్స్ ఎలా సెట్ అయ్యాయా? అని కూడా చర్చలు జరుగుతుంటాయి. మనోజ్ హీరోగా ఆరంభమైన ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’ చిత్రంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారని వినగానే అలాంటి చర్చలే జరిగాయి. చాలామంది ఉలిక్కిపడ్డారు కూడా. వాస్తవానికి ఈ చిత్రంలో నటించమని బాలకృష్ణను అడిగే ముందు లక్ష్మీప్రసన్న, మనోజ్ కూడా టెన్షన్ పడ్డారు. ఒకవేళ బాలయ్య ఒప్పుకోకపోతే? అని చర్చించుకున్నారు. కథ వినగానే ‘ఈ సినిమాలో నేను నటిస్తా’ అని బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే ఈ అక్కా తమ్ముళ్లు ఊపిరి పీల్చుకున్నారు. 

మనోజ్ అయితే ‘‘బాలయ్య అన్నయ్య కాంబినేషన్‌లో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అన్నయ్య ముక్కుసూటి మనిషి. ఆయనలో అంకితభావం ఎక్కువ’’ అని చెప్పారు. డా. మోహన్‌బాబు సమర్పణలో మనోజ్, దీక్షాసేథ్ జంటగా శేఖర్‌రాజా దర్శకత్వంలో లక్షీప్రసన్న ఓ కీలక పాత్ర చేసి, నిర్మించిన చిత్రం ఇది. 

ఈ చిత్రంలో అన్నయ్య చేసిన పాత్ర సినిమాకుహెల్ప్ అవుతుందని, ‘పెదరాయుడు’లో తన తండ్రి మోహన్‌బాబు చేసిన పాత్ర తరహాలో ఈ పాత్ర ఉంటుందని కూడా ఆమె చెప్పారు. ఈ నెలాఖరున ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.