11 జూన్, 2012

ప్రకాష్‌రాజ్ దర్శకత్వంలో అమీర్‌ఖాన్?

                                                                 


     

 ప్రకాష్‌రాజ్ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ నటించనున్నారా? ప్రస్తుతం కోలీవుడ్‌లో వాడి వేడిగా జరుగుతున్న చర్చ ఇదే. ప్రకాష్‌రాజ్‌కు నటుడిగా దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ధోని చిత్రంతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నారు. ప్రస్తు తం ప్రకాష్‌రాజ్ 2008లో తమిళంలో నిర్మించిన సూపర్‌హిట్ చిత్రం అభియుమ్ నానుమ్ చిత్రాన్ని హిందీలో స్వీయ దర్శకత్వంలో రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.

తమిళంలో ప్రకాష్‌రాజ్, త్రిష ముఖ్య పాత్రల్ని పోషించిన ఈ చిత్రానికి రాధామోహన్ దర్శకత్వం వహించారు. హిందీ రీమేక్‌లో ప్రకాష్‌రాజ్ పాత్రను అమీర్‌ఖాన్ పోషించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ప్రకాష్‌రాజ్‌ను అడగ్గా అభియుమ్ నానుమ్ చిత్రాన్ని హిందీలో పునర్ నిర్మించనున్న విషయం నిజమేనని స్పష్టం చేశారు.

ఇందులో నటించే నటీనటుల్ని ఇంకా ఎంపిక చేయలేదని అన్నారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో హిందీలో రీమేక్ కానున్న సామి చిత్రంలో విలన్ పాత్రలో ప్రకాష్‌రాజ్ నటించనున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లోనూ ప్రకాష్‌రాజ్ విలన్‌గా నటించారన్నది గమనార్హం.