30 జూన్, 2012

వైజాగ్‌లో జూలై 14న శ్రీకాంత్ వర్సెస్ తరుణ్!
టాలీవుడ్ తెలుగు హీరోలు శ్రీకాంత్, తరుణ్ ఒకరిపై మరొకరు తలపడనున్నారు. వీరు తలపడేది సినిమాలోనో, నిజ జీవితంలోనో కాదు... క్రికెట్‌లో. విషయానికి వస్తే జూలై 14వ తేదిన వైజాగ్‌లో స్టార్ క్రికెట్ నిర్వహిస్తున్నారు. టాలీవుడ్ అసోసియేషన్, విజేత గ్రూప్ అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో ఈ స్టార్ క్రికెట్‌ను నిర్వహిస్తున్నారు.

టాలీవుడ్ నుండే రెండు జట్లు పోటీ పడనున్నాయి. ఓ జట్టుకు శ్రీకాంత్ రెండో జట్టుకు తరుణ్ సారథ్యం వహించనున్నాడు. వైజాగ్‌లోని డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో ఈ క్రికెట్ నిర్వహిస్తున్నారు. ఈ టి-20 క్రికెట్ కోసం మన నటులు త్వరలోనే ప్రాక్టీస్ మొదలు పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారట.

దీని ద్వారా వచ్చే మొత్తాన్ని సామాజిక సేవ కోసం వినియోగిస్తామని విజేత గ్రూప్ అసోసియేషన్ చైర్మన్ తెలిపారు. సామాజిక సేవ దృక్ఫథంతో ఇలాంటి చారిటీ మ్యాచ్‌లు ఆడుతున్నట్లు హీరోలు శ్రీకాంత్, తరుణ్‌లు చెప్పారు. ఇంతకుముందు ఇలాంటివి చాలా ఆడామని తెలిపారు.

కాగా సామాజిక సేవా దృక్పథంతో సినీ నటులు పలుమార్లు చారిటీ మ్యాచ్‌లు ఆడిన విషయం తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ తదితర జట్లు కూడా గతంలో తలపడ్డాయి. మన తెలుగు నటులు కూడా చారిటీ టెస్టులు గతంలో ఆడారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునల సారథ్యంలో టాలీవుడ్ నాలుగు జట్లుగా స్టార్ క్రికెట్ ఆడింది.