23 మార్చి, 2012

మధ్యంతర ఎన్నికలు రావచ్చు.. సిద్ధంగా ఉండండి: ములాయం

                        Mulayam 
దేశంలో రాజకీయ అనిశ్చిత నాట్యమాడుతోందనీ, ఏ క్షణమైనా ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకమయ్యే అవకాశం లేకపోలేదని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో రామ్ మనోహర్ లోహియా పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన సమాశంలో పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 

దేశంలో ఏ క్షణమైన మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నదనీ, కనుక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన హామీలన్నీ మరో 6 నెలల లోపు నెరవేర్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

ములాయం పిలుపు ఆయా రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశమైంది. ఒకవైపు మమతా బెనర్జీ మొండి వైఖరి, ఇంకోవైపు బొగ్గు, 2జీ.. ఇలా వరుస స్కాంలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ అంశం కాంగ్రెస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సమస్యలన్నీ ఏకమై ఏదో ఒకరోజు విస్ఫోటనం చెందే అవకాశం లేకపోలేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అభిప్రాయాన్ని ములాయం కూడా వ్యక్తం చేస్తున్నారని వారు చెపుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..?!!