23 మార్చి, 2012

విడాకులు తీసుకుంటే భర్త ఆస్థిలో భార్యకు కూడా భాగం ఇవ్వాలి

విడాకులు తీసుకునే పక్షంలో భర్త ఆస్థిలో భార్యకు కూడా భాగం ఇచ్చే విధంగా వివాహ చట్టంలో మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వివాహచట్ట సవరణ ముసాయిదా రెండు సంవత్సరాల క్రితమే పలు రాష్ట్రాలలో దాఖలు చేయబడింది. దానిని కేంద్ర ప్రభుత్వం న్యాయాధిపతులకు పరిశీలన నిమిత్తం అప్పగించింది. దానిని పరిశీలించిన బృందం ముసాయిదాలో నాలుగు ముఖ్యమైన మార్పులు చేయవలసిందిగా విన్నవించింది.

"తల్లిదండ్రులు విడాకులు తీసుకునేటట్టయితే వారికి పుట్టిన పిల్లలకు, అదేవిధంగా దత్తత తీసుకున్న పిల్లలకు ఆస్థిలో సమాన హక్కు కల్పించాలి. విడాకులు తీసుకునే పక్షంలో వివాహమైన తర్వాత భర్త ఆస్థిలో భార్యకు భాగం దక్కే విధంగా హక్కును ఏర్పరచాలి. విడాకుల కేసులో కొత్త సెక్షన్ ప్రకారం భర్త విడాకులు కోరితే, భార్యకి దానిని వ్యతిరేకించే హక్కును కల్పించాలి". ఇటువంటి అనేక విషయాలను అందులో విన్నవించారు. 

వాటిని ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం, చట్టంలో చేర్చేవిధంగా ముసాయిదాను సవరించాలని నిర్ణయించింది.