24 మార్చి, 2012

జూ ఎన్టీఆర్‌కు అనుకుంటే అల్లరి నరేష్‌కు దక్కింది

 Anil Sunkara’s 3D film Action launched
జూ ఎన్టీఆర్-శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చే సినిమా కోసం ఆ మధ్య ‘యాక్షన్’ అనే టైటిల్ పరిశీలించిన సంగతి తెలిసిందే. అయితే ఆ టైటిల్ అంత ఎఫెక్టివ్‌గా లేదని ‘బాద్ షా’ అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా ‘యాక్షన్’ టైటిల్ అల్లరి నరేష్ దక్కించుకున్నాడు. 'బిందాస్', 'అహ నా పెళ్లంట', 'దూకుడు' చిత్రాలను నిర్మించిన అనిల్ సుంకర ఇప్పుడు దర్శకునిగా మారి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనరుపై రూపొందిస్తున్న ఈచిత్రానికి 'యాక్షన్'(విత్ ఎంటర్‌టైన్‌మెంట్) పేరు ఖరారు చేశారు. అల్లరి నరేశ్, వైభవ్, రాజుసుందరం, కిక్ శ్యామ్, స్నేహా ఉల్లాల్, విమలారామన్, కామ్న జెఠ్మలానీ, నాజర్, కాళీ తదితరులు నటిస్తున్నారు. రూ. 15 కోట్ల వ్యయంతో 3డి చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఉగాది సందర్భంగా శుక్రవారం ఉదయం చెన్నయ్‌లో ప్రారంభమైంది. తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీను వైట్ల, వెంకటప్రభు, శింబు, అల్లరి నరేశ్, వైభవ్, రాజుసుందరం, శ్రీరామ్, శ్యామ్ తదితరులు హాజరయ్యారు. తెలుగు వెర్షన్ ఓపెనింగ్ షాట్‌కు శ్రీను వైట్ల క్లాప్‌నివ్వగా, ఎఎంరత్నం కెమెరా స్విచాన్ చేశారు. ఎ.కోదండరామిరెడ్డి తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. . తమిళ వెర్షన్ ఓపెనింగ్‌షాట్‌కు శింబు క్లాప్‌నివ్వగా, రోశయ్య కెమేరా స్విచాన్ చేశారు. వెంకట్‌ప్రభు ఫస్ట్‌షాట్‌కు దర్శకత్వం వహించారు.

హైదరాబాద్, చెన్నయ్, గోవా, బ్యాంకాక్, ఫిన్‌ల్యాండ్ లొకేషన్లలో షూటింగ్ చేస్తాం. ఈ సినిమాతో సంగీత దర్శకుడు బప్పీలహరి తనయుడు బప్పాలహరిని సంగీత దర్శకునిగా దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నామని, తెలుగు, తమిళంలో ఒకేసారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని దర్శకుడు తెలిపారు. అలాగే బప్పీలహరి కూడా ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నారు అన్నారు. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: సర్వేష్ మురారి, సంగీతం: బప్పాలహరి, నేపథ్య సంగీతం: తమన్, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, దర్శకత్వం: అనిల్ సుంకర.