27 మార్చి, 2012

నేడు చిరంజీవి రాజీనామా, మేలో ఉప ఎన్నికలు

                                       Chiranjeevi


తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవి రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఆయన మంగళవారం తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఇదే రోజు ఆయన రాజ్యసభ ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోనున్నారు. 2009 ఎన్నికల్లో తిరుపతి నుండి గెలుపొందిన చిరంజీవి ఇటీవల తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేసిన విషయం తెలిసిందే. గత సంవత్సరం డిసెంబర్‌లో తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని గట్టెక్కించారు. ఈ సందర్భంగా చిరుకు అధిష్టానం ఇచ్చింది. ఆ మేరకు ఆయనను రాజ్యసభకు పంపింది. ఇక కేంద్రమంత్రి పదవే మిగిలి ఉంది. ఆయన పదకొండు గంటలకు రాజీనామా చేసే అవకాశముంది.

మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేతల రాజీనామాలతో ఖాళీ అయిన 17 నియోజకవర్గాల ఉప ఎన్నికలు మేలో జరిగే అవకాశముంది. పదిహేడు అసంబ్లీ, ఎస్పీఎస్ నెల్లూరు లోకసభ స్థానానికి త్వరలో ఎన్నికలు జరపనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్ వై ఖురీషీ సోమవారం చెప్పారు. జూన్ నెలలో రాష్ట్రపతి ఎన్నికలు ఉన్న దృష్ట్యా ఆ లోపే దేశంలోని అన్ని స్థానాలలో ఉప ఎన్నికలు జరిపాలని నిర్ణయించుకున్నట్లు ఖురేషి చెప్పారు. తిరుపతి స్థానంపై తనకు ఇప్పటి వరకైతే తెలియదన్నారు.

చిరంజీవి అప్పటి వరకు రాజీనామా చేయనందున ఆ విషయం తెలియదు. చిరు మంగళవారం రాజీనామా చేయనున్నారు. దీంతో ప్రభుత్వం ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్తుంది. దీంతో పదిహేడు అసెంబ్లీ, ఎస్పీఎస్ నెల్లూరు లోకసభ స్థానంతో పాటే చిరంజీవి రాజీనామాతో ఖాళీ కానున్న తిరుపతిలోనూ ఉప ఎన్నికలు మేలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. www.mulakkada.com