29 మార్చి, 2012

పవన్-పూరి కలిస్తే సంచలనమే..

                                     Pawan Kalyan-Puri Jagannath

ఒక స్టార్ హీరో, ఒక క్రేజీ దర్శకుడు కలిస్తే ఆ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగి పోతాయి. కలెక్షన్ల పరంగానైనా, ఇతర విషయాల్లోనూ సంచలనం సృష్టిస్తుంటాయి. ఇటీవల పూరి-మహేష్ కాంబినేషన్లో వచ్చిన ‘బిజినెస్ మేన్’ చిత్రమే ఇందుకు నిదర్శనం. తాజాగా అలాంటి సంచలన మరోసారి సృష్టించడానికి వస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-క్రేజీ దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందబోతున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం ఇప్పటికే లాంఛనంగా ప్రారంభం అయింది. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ మే 2వ వారం నుంచి మొదలు కానుంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. పవర్ స్టార్ ఈచిత్రంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు రాంబాబు పాత్ర చేస్తుండగా...గంగ పాత్రలో తమన్నా నటించనుంది. 


గతంలో పవన్-పూరి కాంబినేషన్లో వచ్చిన ‘బద్రి’ చిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో.... ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం కూడా ప్రారంభానికి ముందు నుంచే హైప్ పెరిగి పోయింది. డి.వి.వి దానయ్య ఈచిత్రానికి ప్రొడ్యూసర్. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘జల్సా’ చిత్రానికి సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రంలో మీడియాలోని చీడ పరుగులపై సెటర్లు ఉంటాయని, విలువలు దిగజార్చి మీడియాను డబ్బు సంపాదించడానికి, అక్రమార్జనకు వాడుకుంటున్న వారిని ఎండగట్టే విధంగా డైలాగులు ఉంటాయని అంటున్నారు. అదే జరిగితే పవన్ కళ్యాణ్ తాజా సినిమా మీడియాలో సెన్షేషన్ సృష్టించడం ఖాయం.


పని విషయంలో పర్ ఫెక్టుగా ఉండే పూరి జగన్నాథ్...ఈ చిత్రాన్ని పక్కాగా ప్లాన్ చేసి అనుకున్న సమయంలోనే పూర్తి చేస్తాననే నమ్మకంతో ఉన్నాడు. ఆ కాన్ఫిడెన్స్ తోనే అక్టోబర్ 18న సినిమా విడుదల చేస్తామని ముందస్తు ప్రకటన చేశాడు కూడా. ప్రకాశ్‌ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటో గ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: శేఖర్, ఫైట్స్: విజయ్, నిర్మాత: డివివి దానయ్య, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.