23 మార్చి, 2012

నా రాజీనామాపై దుష్ప్రచారం: పీసీసీ చీఫ్

                                 నా రాజీనామాపై దుష్ప్రచారం: పీసీసీ చీఫ్

తానంటే గిట్టని వాళ్లే రాజీనామాలపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహిస్తూ సీఎం కిరణ్, బొత్స సత్యనారాయణలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో బొత్స స్పందించారు. 

తానంటే గిట్టని వాళ్లే రాజీనామాలంటూ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కొంతమంది నేతలకు మీడియా, పత్రికలు వత్తాసు పలుకుతున్నాయని విమర్శించారు. మాజీ మంత్రి శంకర్రావు ఎపిసోడ్ గురించి పార్టీ వేదికపై చర్చిస్తానని బొత్స అన్నారు. ఇక తాను రాజీనామా చేయాలా? వద్దా? అనేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. 

మరోవైపు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిదే బాధ్యత అని ఎంపీ వివేక్ ఆరోపించారు. కాంగ్రెస్‌ను ప్రజలు ఓడించారని, ఈ నేపథ్యంలో సీఎం రాజీనామా ఆయన విచక్షణపై ఆధారపడి ఉంటుందని ఎంపీ వివేక్ వ్యాఖ్యానించారు