23 మార్చి, 2012

2014 ఎన్నికల్లో మెజారిటీ సీట్లు జగన్‌కే వస్తాయ్: కేకే

                                                         KK

ప్రస్తుతం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఇదే తీరున సాగితే వచ్చే 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో మెజారిటీ సీట్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కె. కేశవరావు చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను సంప్రదించకుండా ఉపఎన్నికల సమయంలో ఒంటెద్దు పోకడ పోవడం వల్లనే ఈ దుస్థితి తలెత్తిందని మండిపడ్డారు. జెడ్పీటీసీలు ఓడిపోతేనే ఇద్దరు మంత్రులను వైఎస్ రాజశేఖర రెడ్డి మార్చారని గుర్తు చేశారు. వైఎస్సార్ సీనియర్ల సలహాలు తీసుకునేవారనీ, కానీ సీఎం కిరణ్ అంతా నేనే అన్నట్లుగా ముందుకు వెళుతూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. 

తెలంగాణ ఉపఎన్నికల్లో అభివృద్ధి నినాదంతో వెళ్తున్నప్పుడు అది పని చేయదని తాను చెప్పానన్నారు. అభ్యర్థులకు టికెట్లు ఇచ్చేటపుడు కానీ, ప్రచారం సమయంలో కానీ సీనియర్లను సంప్రదించలేదన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి సమాచారం లేదన్నారు. 

అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి వెన్నెముక అయిన జానారెడ్డితో కూడా కనీసం చర్చించి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. ఇటువంటి ఒంటెద్దు పోకడ పోవడం వల్లనే పార్టీ భారీగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కోవూరు ఎన్నికలను కూడా కిరణ్ చాలా తేలిగ్గా తీసుకున్నారని అన్నారు. ఎక్కడా గెలిచి తీరాలన్న పట్టుదలతో పని చేసినట్లు కనిపించలేదన్నారు. 

తెలంగాణ వ్యవహారంలో పార్టీని కిరణ్ తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఫలితాలకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలంటూ డీఎల్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా అధిష్టానం అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రాంతంలో మటుకు తెలంగాణా ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ బతుకుతుందనీ లేదంటే కనుమరుగై పోవడం ఖాయమని జోస్యం చెప్పారు.