22 ఫిబ్ర, 2012

..ఏదైనా ఐతే అమ్మ: అరెస్టు ప్రచారంపై జగన్ కామెంట్!

హైదరాబాద్: తాను తన అరెస్టు గురించి ఆలోచించడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం తన వర్గం శాసనసభ్యులతో అన్నట్లుగా సమాచారం. మంగళవారం సాయంత్రం జగన్ తన వర్గం ఎమ్మెల్యేలతో లోటస్ పాండులో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు రెండు కలిసి మరికొద్ది రోజుల్లో జగన్ అరెస్టు అవుతారని ప్రచారం చేస్తున్నాయని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారని తెలుస్తోంది. అందుకు స్పందించిన జగన్.. తాను అరెస్టు గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని, వారు ఏమైనా అనుకోనివ్వమని, నేను మాత్రం నా అజెండాతో ముందుకెళతానని, ఒకవేళ అనుకోని పరిస్థితులు ఎదురైతే నా తల్లి విజయలక్ష్మి పార్టీ వ్యవహారాలు చూసుకుంటుందని వారితో చెప్పినట్లుగా తెలుస్తోంది.

అంతేకాకుండా శాసనసభలో ప్రజా సమస్యలు ప్రస్తావించి బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని కూడా తన వర్గ ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. సభ్యులందరూ సభకు విధిగా హాజరవ్వాలని ఆయన సూచించారు. నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రతి ఒక్కరూ శాయశక్తులా కృషి చేయాలని పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులను జగన్ ఆదేశించారు. 16 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు, ఒక ఎంపి హాజరైన ఈ సమావేశానికి అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, అనకాపల్లి ఎంపి సబ్బం హరి గైర్హాజరయ్యారు.