26 ఫిబ్ర, 2012

నాగార్జున వైయస్ జగన్ వైపా, కాంగ్రెసు వైపా?


హైదరాబాద్: హీరో అక్కినేని నాగార్జున కాంగ్రెసు వైపు ఉంటారా, వైయస్ జగన్ వైపు ఉంటారా అనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. తనకు రాజకీయాలంటే ఇష్టమని నాగార్జున ప్రకటించడంతో ఈ చర్చ ప్రారంభమైంది. అక్కినేని కుటుంబ సభ్యులు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనకపోయినప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అక్కినేని నాగార్జునతో కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం వైయస్ రాజశేఖర రెడ్డి ప్రచారం చేయించగలిగారు. ప్రభుత్వ అనుకూల ప్రచార ప్రకటనల్లో కనిపించారు. అందుకు అన్నపూర్ణ స్టుడియోలో మల్టీ ప్లెక్స్, షాపింగ్‌కాంప్లెక్సులకు వైఎస్ అనుమతి ఇచ్చారనే ఆరోపణలున్నాయి. దానిపై అప్పట్లో ప్రధా న ప్రతిపక్షమైన టీడీపీ విమర్శలు కురిపించింది. 

వైయస్ మరణానంతంరం నాగార్జున వైయస్ జగదన్మోహన్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి పదవికి జగన్ అర్హుడంటూ ఆయన ప్రకటన చేశారు. అయితే, వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల ఏర్పడిన అనుబంధంతో నాగార్జున కాంగ్రెసు వైపు ఉండే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇటీవల ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. జాతీయ పార్టీ మాత్రమే కాకుండా అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి నాగార్జున కాంగ్రెసును ఎంపిక చేసుకోవచ్చునని అంటున్నారు. 

వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా వైయస్ జగన్‌పై నాగార్జునకు కొంత అనుకూలత ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, వైయస్ జగన్ కేసుల్లో ఇరుక్కోవడం నాగార్జునను పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. వివాదాలకు, సమస్యలకు దూరంగా ఉండే నాగార్జున వైయస్సార్ కాంగ్రెసు వైపు వెళ్లకపోవచ్చునని అంటున్నారు.