24 ఫిబ్ర, 2012

ప్రభాస్‌ మాట వినకుండా ఇష్టానుసారంగా లారెన్స్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ‘రెబల్’చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన చాలా కాలం అయినా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. పైగా సినిమా నుంచి చాలా మంది అర్ధాంతరంగా తప్పకున్నారు. అప్పట్లో అనుష్క, ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ తమన్. లారెన్స్ వ్యవహార శైలి వల్లనే ఇలా జరుగుతోందని అంటున్నారు. 

ప్రస్తుతం రెబల్ షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. దర్శకుడు రాఘవ లారెన్స్ క్లైమాక్స్ ఫైట్స్‌ను రామ్ లక్ష్మణ్‌తో చేయించాలని నిర్ణయించాడు. అయితే వారు వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో ప్రస్తుతానికి అందుబాటులో లేరు. దీంతో దర్శకుడు సినిమా షూటింగును వాయిదా వేశాడు. అయితే దీని వల్ల సినిమా మరింత లేట్ అవుతుందని, వేరే ఫైట్ మాస్టర్స్ ను తీసుకుందామని ప్రభాస్ సలహా ఇచ్చాడట. అయితే లారెన్స్ మాత్రం ప్రభాస్ మాటలను వినకుండా, కనీసం పట్టించుకోకుండా షూటింగ్ వాయిదా వేశాడని తెలుస్తోంది. 

అనుష్క విషయంలో, తమన్ విషయంలో లారెన్స్ తేడాగా వ్యవహరించినా ప్రభాస్ మిన్నకున్నాడని, తాజాగా ఫైట్ మాస్టర్స్ విషయంలోనూ అతని తీరు మార్చుకోక పోవడంతో ప్రభాస్ కోపంగా ఉన్నాడని ఫిల్మ్ నగర్ టాక్. అయితే గొడవ పడితే అనవసరంగా సినిమాకు చెడ్డపేరు వస్తుందనే ఆలోచనలో సహనంగా ఉంటున్నాడని సమాచారం.