27 ఫిబ్ర, 2012

సునీల్ కి సిక్స్ ప్యాక్ అవసరమా?...దాసరి'అందాలరాముడు' చూసి చాలా ముచ్చటపడ్డాను. సునీల్‌ ఇప్పుడు 'పూలరంగడు' కోసం సిక్స్‌ప్యాక్‌ చేయడం అవసరమా? అని నాకు అనిపించింది. కానీ చివర్లో దాన్ని కథకు అనుగుణంగా చూపించి దర్శకుడు విజయం సాధించాడు అన్నారు దాసరి నారాయణ రావు. తాజాగా ఆయన ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన 'పూలరంగడు' విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యి ఇలా స్పందించారు. అలాగే తెలుగు సినిమాకి తెలుగు పేరు పెట్టడం నామోషీగా భావిస్తున్నారు మనవాళ్లు. ఇలాంటి దౌర్భాగ్యం పక్క రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. మనం మాత్రం ఎవర్నో చూసి అనుసరిస్తున్నాం. ఇంగ్లిష్‌వాళ్లు వెళ్లిపోయినా ఆ బానిసత్వం మనకు పోలేదనిపిస్తోంది అన్నారు . 

అలాగే ''ఈ సినిమా పేరు నాకు బాగా నచ్చింది. ఒక హాస్యనటుడు హీరోగా మారి విజయాన్ని సాధించడం అరుదైన విషయం. ఇదివరకు రాజబాబు, నగేష్‌, చలం వీళ్లు మాత్రమే ఈ తరహాలో విజయాలు సాధించారు. రాజబాబుతో నేను 'తాతామనవడు', 'ఎవరికివారే యమునాతీరే', 'తిరుపతి'లాంటి సినిమాలు తీశాను. అవన్నీ వంద రోజులు ఆడాయి. ఇప్పుడు మళ్లీ సునీల్‌ ఆ ట్రెండ్‌ని కొనసాగిస్తున్నారు. ఇక సునీల్‌ మాట్లాడుతూ... కొత్తగా వెళ్లేదారిలో ముళ్లుంటాయి. వాటిని ఏరుకొంటూ వెళ్లాను. అందుకే ఈ ఫలితం దక్కింది. సన్నబడినందుకు ఇంట్లో అమ్మ తిట్టింది. కోట శ్రీనివాసరావులాంటి నటులు నన్ను మందలించారు. సంగీతం, సంభాషణలు, ఛాయాగ్రహణం, దర్శకత్వం... ఇవన్నీ ఈ సినిమా విజయానికి కారణమయ్యాయని అన్నారు.