15 ఫిబ్ర, 2012

విజయకాంత్‌లా ఉంటే: చిరంజీవి రైజింగ్‌స్టార్‌పై రోజా వ్యాఖ్య

హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి బయటే ఉంటే రైజింగ్ స్టార్ అయ్యేవారని కానీ తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినందున ఆయనకు ఆ అవకాశం లేకుండా పోయిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత రోజా బుధవారం ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో అన్నారు. మంగళవారం చిరంజీవి వర్గం మంత్రి రామచంద్రయ్య మాట్లాడుతూ చిరంజీవి రాజకీయాల్లో రైజింగ్ స్టార్ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె స్పందించారు. రామచంద్రయ్య స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారన్నారు. తనకు మంత్రి పదవి రావడం కోసం అంతగా ప్రయత్నాలు చేసిన చిరంజీవిని అలా పొగడకుంటే ఎలా అన్నారు. చిరంజీవి పిఆర్పీ ఉంటే ఆయన రైజింగ్ స్టార్ అయ్యేవారన్నారు. విలీనం తర్వాత అది కోల్పోయారన్నారు. తమిళనాడులో డిఎండికె అధినేత విజయకాంత్ ఒక్క సీటు గెలిచినప్పటికీ ఆయన బయటే ఉన్నారని గుర్తు చేశారు. కానీ ఇక్కడ చిరంజీవి మాత్రం పద్దెనిమిది సీట్లు గెలుచుకున్నప్పటికీ కాంగ్రెసులో విలీనమయ్యారన్నారు. విజయకాంత్‌లా ఉంటే బాగుండేదన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్నారన్నారు. తమ పార్టీ వైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారని ఆమె చెప్పారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను అణగదొక్కేందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మద్యం సిండికేట్లపై ఎసిబి దాడులు చేయించారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అయితే అది సిఎంకే భస్మాసుర హస్తమైందన్నారు. పలువురు మంత్రులు, నేతలు ఇరుక్కున్నారని అన్నారు.

1 వ్యాఖ్య:

తెలుగు పాటలు చెప్పారు...

హహహ పదిమందిలో పేరు రావాలి అంటే మంచి పేరు ఉన్న వ్యక్తిని ని పొగడటం నో లేక తిట్టటమో చేయాలి.. అలాంటి వాళ్లే వీళ్ళు.. ఎప్పుడూ బాగుపడుతారో ఏమో... యేజ్ పెరిగేకొలది తెలివి పెరగాలి కాని వీళ్ళకి ఇంక తగ్గిపోతుంది..