25 ఫిబ్ర, 2012

నన్ను ఆదర్శంగా తీసుకోండి, అబ్రహం లింకన్ స్ఫూర్తి: చిరంజీవి

రాజమండ్రి: యువత తనను ఆదర్శంగా తీసుకోవాలని తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవి శనివారం అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అబ్రహం లింకన్ స్ఫూర్తిగా తాను రాజకీయాల్లో ఎదుగుతానని ఆయన అన్నారు. రాజకీయాల్లో దృఢ సంకల్పంతో తాను ముందుకు వెళతానని అన్నారు. ఎన్నో ఏళ్లు కష్టపడి స్టార్ హీరోగా ఎదిగిన తన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కాగా చిరంజీవి రాకతో అక్కడ అంతా ఉత్సాహభరితంగా కనిపించింది. అభిమానులు కేరింతలు కొట్టారు.

తన సోదరులు హీరో పవన్ కల్యాణ్, నిర్మాత నాగబాబు తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతున్నాడనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చిరంజీవి శుక్రవారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వారు టిడిపిలోకి వెళ్లరని ఆయన రాజమండ్రిలో చెప్పారు. కాంగ్రెసు పార్టీలో ఎలాంటి గ్రూపు విభేదాలు లేవన్నారు. గ్రూపులు ఉన్నాయనేది కేవలం మీడియా సృష్టి మాత్రమేనన్నారు. కాంగ్రెసులో తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడం ద్వారా తనకు మంచి వేదిక దొరికిందన్నారు.

విలీనానంతరం రాజకీయంగా తన బలం మరింత పెరిగిందని అన్నారు. ఉప ఎన్నికల్లో ప్రచారం చేసే అంశంపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. పార్టీ ఆదేశాల మేరకే తాను పని చేస్తానని చెప్పారు. ఉప ఎన్నికల్లో ప్రచారం చేయమని పార్టీ ఆదేశిస్తే వెళతానని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ కొంత పని చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ పార్జీ విజయం సాధిస్తుందో చెప్పడానికి తాను జ్యోతిష్యుణ్ణి కాదన్నారు. పార్టీలో తనకు ఎవరితోనూ విభేదాలు లేవన్నారు.