20 ఫిబ్ర, 2012

యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని వేగవంత చేసిన ఇరాన్

అంతర్జాతీయ సమాజం చేస్తున్న విజ్ఞప్తులను ఇరాన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ వారాంతంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) ప్రతినిధులు టెహ్రాన్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్ తాజాగా యురేనియం శుద్ధీకరణ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేసింది. ఇందుకోసం అణు రియాక్టర్లలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అత్యాధునిక శుద్ధీకరణ కడ్డీలను అమర్చింది. 

వాస్తవానికి అంతర్జాతీయ అణుశక్తి ఇంధన సంస్థ ప్రతినిధులు గత వారమే ఇరాన్‌లో పర్యటించాల్సి వుంది. అయితే, తన అణు కార్మాగాలను తనిఖీ చేసేందుకు ఇరాన్ అనుమతించలేదు. ఐఏఈఏ ప్రతినిధి బృందం తమ పర్యటనను వాయిదా వేసుకుంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్ మాత్రం తన అణు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసింది. 

యురేనియం శుద్ధీకరణ కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. యురేనియం శుద్ధీకరణ కడ్డీలతో పాటు.. అణు విద్యుత్ ఉత్పత్తి తయారీకి ఉపయోగించే పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇరాన్ స్వయంగా అందించుకుని తన అణు కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది.