24 ఫిబ్ర, 2012

బాబోయ్...జూ ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ అంతా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎంత? అంటే ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా కూడా లెక్కలు లేవు. అయితే మీడియాలో మాత్రం గత కొంత కాలంగా ఆయన రెమ్యూనరేషన్ రూ. 7 కోట్ల నుంచి 9 కోట్ల మధ్యలో ఉండి ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఫిల్మ్ నగర్ లో జూనియర్ తీసుకునే రెమ్యూనరేషన్ పై మరో పుకారు మొదలైంది. దమ్ము చిత్రం తర్వాత జూనియర్ తన రెమ్యూనరేషన్ ను ఏకంగా రూ. 12 కోట్లకు పెంచాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దమ్ము చిత్రంలో నటిస్తున్నాడు. కెఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బాద్ షా’ అనే మరో సినిమాలో నటించబోతున్నాడు ఈ హీరో. కెఎస్ రామారావు జూ ఎన్టీఆర్ ను దమ్ము తర్వాత మరో సినిమాలో కూడా బుక్ చేసుకున్నాడని, ఇందు కోసం ఆయనకు రూ. 12 కోట్లు ఆఫర్ చేశారని ప్రచారం జరుగుతోంది. బాద్ షా చిత్రం తర్వాత ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈ ప్రచారంలో నిజమెంతో తేలాల్సి ఉంది. ఒక వేళ ఇదే నిజమైతే జూనియర్ టాలీవుడ్ లో హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరో అవుతాడు అంటున్నారు ట్రేడ్ విశ్లషకులు. 

జూ ఎన్టీఆర్ నటిస్తున్న దమ్ము చిత్రానికి బోయపాటి దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష, కార్తీక ఈచిత్రంలో హీరోయిన్లుగా చేస్తున్నారు. ఎన్టీఆర్ ఇందులో డబల్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రం ఇటీవల పొలాచ్చిలో ఓ పాట, కొన్ని యాక్షన్‌ ఘట్టాలతో పాటు కీలకమైన సన్నివేశాలు తెరకెక్కింది. ఈనెల 27 నుంచి హైదరాబాద్‌లో తదుపరి షెడ్యుల్ షూటింగ్ మొదలుపెడతారు. ఇక దమ్ము చిత్రం ఆడియో ఉగాది రోజున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.