25 ఫిబ్ర, 2012

రామోజీ రావుకి షాక్: ఫిల్మ్‌సిటీ పిటిషన్ కొట్టివేసిన జెసి

హైదరాబాద్: రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న 60.2 ఎకరాలు ప్రభుత్వ మిగులు భూమేనని రంగారెడ్డి జెసి కలెక్టర్ స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ సర్వే నివేదిక ఆధారంగా.. ఈ విషయంలో ఫిల్మ్ సిటీ యాజమాన్యం దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. ఇన్నాళ్లూ, తమ స్వాధీనంలో ప్రభుత్వ భూములేవీ లేవని ఫిల్మ్ సిటీ యాజమాన్యం చెబుతూ వస్తుండగా, కాదు 36 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రెవెన్యూ అధికారులు ఇన్నాళ్లుగా వాదిస్తూ వచ్చారు. దీంతో రంగారెడ్డి జిల్లా జెసి జగన్నాథం ఈ భూములపై ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ సర్వేకు ఆదేశించారు. చివరకు.. అక్కడ 36 మాత్రమే కాదు 60.2 ఎకరాల ప్రభుత్వ మిగులు భూములు ఉన్నట్లు సర్వే అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు వారు నివేదిక ఇవ్వగా, ఆ నివేదిక మేరకు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును జెసి శుక్రవారం కొట్టివేశారు. 60 ఎకరాలు ప్రభుత్వ మిగులు భూమేనని సర్వేలో తేలినట్లు అందులో తెలిపింది.

కాగా అంతకుముందు ఇదే విషయమై ఉషాకిరణ్ మూవీస్ లిమిటెడ్ ఎండి రామ్మోహన రావు ఓ ప్రకటన విడుదల చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభుత్వ భూమి అన్నదే లేదని అందులో తెలిపారు. సర్వే నివేదిక తమకు ఇంకా అందలేదని.. ఒకవేళ అది తమ కంపెనీకి వ్యతిరేకంగా ఉంటే చట్ట ప్రకారం సవాలు చేస్తామని తెలిపారు. అనాజ్‌పూర్‌లోని 275,281 సర్వేనంబరర్లలో గల 60.2 ఎకరాల ప్రభుత్వ మిగులు భూమి ఉన్నట్లు వచ్చిన కథనంపై ఆయన వివరణ పంపారు. ఈ భూములపై గతంలోనే మండల రెవెన్యూ అధికారులు రకరకాల సంఖ్యలను పేర్కొంటూ మూడుసార్లు ఉత్తర్వులిచ్చారని తెలిపారు.

2005 డిసెంబర్‌లో వచ్చిన ఉత్తర్వూల్లో 50 ఎకరాల 65 సెంట్లు మిగులు భూమి ఉన్నట్లుగా, 2007 జనవరిలో 106 ఎకరాల 58 సెంట్లు మిగులు భూమి ఉన్నట్లుగా పేర్కొన్నారన్నారు. దీని తర్వాత 2007 జూలైలో 36 ఎకరాల 17 గుంటల ప్రభుత్వ మిగులుభూమి ఉన్నట్లు ఎమ్మార్వో ఉత్తర్వూలిచ్చారని, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమ కంపెనీ జాయింట్ కలెక్టర్ వద్ద రివిజన్ పిటిషన్ దాఖలు చేసిందని చెప్పారు. సర్వే నిర్వహించి, సరిహద్దులు నిర్ధారించాలని తాము ఆ పిటిషన్‌లో కోరామని తెలిపారు.