23 ఫిబ్ర, 2012

వైఎస్సార్ కాంగ్రెస్ కోవూరు అభ్యర్థిగా నల్లపరెడ్డి


హైదరాబాద్, న్యూస్‌లైన్ : నెల్లూరు జిల్లా కోవూరు శాసనసభా నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పేరును పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఖరారు చేశారు. నియోజకవర్గం ఎన్నికల ఇంఛార్జిలుగా ముగ్గురు నేతలను కూడా నియమించారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, ఎం.పి మేకపాటి రాజమోహన్ రెడ్డి, జడ్.పి మాజీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్ రెడ్డిని ఎలక్షన్ ఇంఛార్జిలుగా నియమించినట్లు బుధవారం రాత్రి రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల కోఆర్డినేటర్ పి.ఎన్.వి.ప్రసాద్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలోని మండలాల వారీగా ఇద్దరేసి ఇంఛార్జిలను కూడా నియమించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి(ఇందుకూరుపేట), ఆళ్ల రామకృష్ణా రెడ్డి, జిల్లా పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్(కోవూరు), ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి(కొడవలూరు), సిహెచ్.వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, పాశం సునీల్‌కుమార్(విడవలూరు), మాజీ ఎం.పి భూమా నాగిరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి(బుచ్చిరెడ్డి పాళెం) వీరు ఎన్నికలు ముగిసే వరకూ తమకు నిర్దేశించిన మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రచారాన్ని పర్యవే క్షిస్తారు.