28 ఫిబ్ర, 2012

అమెరికాలో రామ్ చరణ్ 'రచ్చ'రచ్చే

రామ్ చరణ్ తాజా చిత్రం 'రచ్చ'బిజినెస్ విషయంలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఓ రేంజి రేటుతో.. 'రచ్చ' అమెరికా డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ ఇప్పటికే అమ్ముడైనట్లు తెలుస్తోంది. రూ.2.7 కోట్ల భారీ మొత్తానికి నిర్మాతలు ఎన్వీ ప్రసాద్‌, పరస్‌ జైన్‌ ఈ హక్కులు విక్రయించినట్లు తెలిసింది. ఈ మేరకు పాపులర్ ఇంగ్లీష్ డైలీ ఓ కథనం ప్రచురించి రచ్చ సత్తాని తెలిపింది. మరో ప్రక్క 'రచ్చ' ఆడియో ఆవిష్కరణకు ముహూర్తం ఖరారైంది. మార్చి 4వ తేదీన కర్నూల్‌లో ఈ సినిమా ఆడియోను విడుదల చేయాలని నిర్ణయించారు. 

తొలుత ఈ కార్యక్రమానికి తిరుపతిని వేదికగా అనుకున్నారు. అయితే, జూన్‌లో చెర్రీ వివాహానంతరం అభిమానులకు ఇక్కడే విందు ఇవ్వబోతున్నందున, 'రచ్చ' ఆడియో విడుదల వేదికగా కర్నూల్‌ పట్టణం ఎంపిక జరిగినట్లు సమాచారం. 'రచ్చ' ఆడియో విడుదల కార్యక్రమంలో భాగంగా 'అదుర్స్‌' రియాల్టీ షోతో అదరగొట్టిన 'బీర్‌ ఖాల్సా' బృందంతో ఒళ్ళు గగుర్పొడిచే స్టంట్స్‌ ప్రదర్శన ఉంటుందని తెలిసింది. తమన్నా, చరణ్‌ల ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చిన టైటిల్‌ ట్రాక్‌ ఇప్పటికే యూట్యూబ్‌లో ఉర్రూతలూగిస్తోంది.