18 ఫిబ్ర, 2012

కోల్డ్ వార్‌కు మోహన్ బాబు, చిరంజీవి స్వస్తి

హైదరాబాద్: ఇద్దరు సూపర్ స్టార్ల మధ్య సఖ్యత కుదిరినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రచ్ఛన్నయుద్ధానికి స్వస్తి చెప్పి కలిసిపోయే రోజలు వచ్చినట్లు చెబుతున్నారు. సంధి కుదుర్చుకునే ఉద్దేశంతో ఇద్దరు సూపర్ స్టార్లు ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతి శానససభ్యుడిగా ఉన్న చిరంజీవి, తిరుపతి అంటే ప్రాణప్రదంగా ఎంచే వీరిద్దరు కలిసిపోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. 

కన్నడ నటుడు, తన సన్నిహిత మిత్రుడు అంబరీష్ గౌరవార్థం ఇచ్చిన విందుకు మోహన్ బాబు చిరంజీవిని ఆహ్వానించినట్లు సమాచారం. ఇటీవలి సిసిఎల్ మ్యాచ్ సందర్భంగా అంబరీష్ హైదరాబాదు వచ్చారు. పార్టీని మోహన్ బాబు తన నివాసంలోనే ఏర్పాటు చేశారు. కొద్ది గంటల పాటు వారు స్నేహపూర్వకంగా మెలిగినట్లు చెబుతున్నారు. అయితే మోహన్ బాబు, చిరంజీవి అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నారని చెబుతున్నారు. తెలుగు సినిమా డైమండ్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా ఇరువురి మధ్య మాటల యుద్ధం నడిచింది. 

అప్పటి నుంచి మోహన్ బాబుకు, చిరంజీవికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందనే ప్రచారం సాగుతూ వస్తోంది. 2011 మార్చిలో మోహన్ బాబు జన్మదిన వేడుకలకు తిరుపతిలో చిరంజీవి హాజరయ్యారు కూడా. మొత్తం మీద ఇరువురి మధ్య స్నేహపూర్వక వాతావరణమే ఉందని చెబుతున్నారు. ఇరువురి రాజకీయ అభిప్రాయాలు కూడా కలుస్తున్నాయని అంటున్నారు.