21 ఫిబ్ర, 2012

మోపిదేవి వెంకటరమణ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

హైదరాబాద్: పది లక్షల రూపాయల ముడుపుల వ్యవహారంలో ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. మోపిదేవికి పది లక్షల రూపాయల లంచం ఇచ్చిన మాట నిజమేనని నున్న రమణ తన కస్టడీ రిపోర్టులో చెప్పాడు. నున్న రమణను కస్టడీలోకి తీసుకుని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు రెండు రోజుల పాటు ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలోని రెండు మద్యం సిండికేట్ల మధ్య సెటిల్మెంట్ జరిపిన వ్యవహారంలో తాము మోపిదేవికి పది లక్షల రూపాయల ముడుపులు ఇచ్చామని అతను చెప్పాడు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఎసిబి అధికారులు రమణను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 

మోపిదేవికి తాము ఏ విధంగా ముడుపులు అప్పగించామనే విషయాన్ని రమణ తన నేరాంగీకర పత్రంలో వివరించారు. రెండు సిండికేట్ల మధ్య గొడవతో రెండు గ్రూపులవాళ్లం మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రిని కలిశామని, ఇరు వర్గాల మధ్య మంత్రి పంచాయతీ చేశారని, అందుకు గాను తాము పది లక్షల రూపాయలు మంత్రి ఇచ్చామని అతను చెప్పాడు. ఇరు వర్గాలకు చెందిన 14 మంది మంత్రి వద్దకు వచ్చారని, పంచాయతీ చేసి మంత్రి రెండు గ్రూపులకు చెందిన ఇద్దరేసిని లోపలికి పిలిచి పది లక్షల రూపాయలు తీసుకున్నారని రమణ చెప్పాడు.