26 ఫిబ్ర, 2012

తలొగ్గని కమలనాథులు : కొత్త పార్టీ యోచనలో యడ్యూరప్ప!

తనను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలన్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప డిమాండ్‌కు కమలనాథులు ఏమాత్రం తలొగ్గలేదు కదా ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటక నాయకత్వాన్ని మార్చే ప్రసక్తే లేదని తేటతెల్లం చేశారు. దీంతో యడ్యూరప్పకు దిమ్మదిరిగి బొప్పికట్టింది. పైపెచ్చు.. కర్ణాటక రాష్ట్ర రాజకీయాలపై చర్చించేందుకు వచ్చే నెల మూడోతేదీన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అలాగే, తన డిమాండ్‌లో ఎలాంటి మార్పు లేదని ఆయన తేల్చి చెప్పారు. 

దీనిపై యడ్యూరప్ప మాట్లాడుతూ గడ్కారీ ఏర్పాటు చేసిన కర్ణాటక బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు తాను, తన అనుచరులు ఢిల్లీ వెళ్లడం లేదన్నారు. ఢిల్లీ వెళ్లడానికి బదులు తాను అన్ని సమస్యలను ఈ నెల 27వ తేదీన తన అనుచరులతో చర్చిస్తానని, ఆ తర్వాత నిర్ణయాన్ని పార్టీ అధిష్టాన వర్గానికి తెలియజేస్తానని స్పష్టం చేశారు. 

అయితే, యడ్యూరప్పను ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం చేసేందుకు భాజపా నాయకత్వం సిద్ధంగా లేదు. ఆయనపై దాఖలైన అవినీతి కేసుల నుంచి నిర్ధోషిగా బయటపడితేనే ఆయనకు తిరిగి సీఎం పగ్గాలు అప్పగిస్తామని గడ్కారీ స్పష్టం చేశారు. అంతేకాక పార్టీలోని చిన్న చిన్న విభేదాలను పరిష్కరించడానికి మార్చి 3న రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. 

ఇదిలావుండగా, యడ్యూరప్ప ఈ నెల 27వ తేదీన తన 69వ పుట్టిన రోజు సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితిని చర్చించడం కోసం తన మద్దతుదారులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో తన భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. తన డిమాండ్‌ను అంగీకరించని పక్షంలో ఏకంగా సొంత పార్టీని పెట్టాలన్న యోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది.