25 ఫిబ్ర, 2012

హీటెక్కించిన నాగార్జున స్టేట్‌మెంట్

తనకు రాజకీయాలు అంటే ఇష్టమని కానీ తాను రాజకీయాలకు సరిపోతాననే నమ్మకం లేదని హీరో నాగార్జున చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయవర్గాల్లో ఇటు ఆయన అభిమానుల్లో చర్చకు దారి తీసాయి. నాగార్జున రాజకీయాలు అంటే ఆసక్తి అని చెప్పడంతో బాలకృష్ణ, చిరంజీవి దారిలోనే 2014 ఎన్నికలలోగా రాజకీయ ఆరంగేట్రం చేస్తారా? ఏ పార్టీలో చేరతారు? ఎక్కడి నుండి పోటీ చేస్తారు? అనే అంశంపై చర్చ ఘాటుగా జరుగుతోంది. నాగార్జున రాజకీయాలపై మొదటిసారి మాట్లాడారు. దీంతో అవి చర్చకు దారి తీశాయి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రభుత్వం తరఫున పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయనను కలిశారు. కాంగ్రెసుతో మంచి సంబంధాలు నెరపుతున్నందు వల్ల ఆయన కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

అయితే నాగార్జున ఆ వ్యాఖ్యలు కేవలం క్యాజువల్‌గానే చేశారని, తనకు రాజకీయాలంటే ఆసక్తి అని చెబుతూనే తాను మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని స్పష్టం చేసిన విషయాన్ని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకున్నప్పటికీ పరోక్షంగా ఓ పార్టీకి సన్నిహితంగా మసలే అవకాశముందంటున్నారు. గతంలో ఆయన పాల్గొన్న ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలు, నేతలతో ఉన్న సంబంధాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలను బట్టి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం మాత్రం కనిపించడం లేదంటున్నారు.