25 ఫిబ్ర, 2012

ఏప్రిల్ తర్వాత రాష్ట్రానికి నాలుగో కృష్ణుడుగా కె.జానారెడ్డి?

ఏప్రిల్ నెల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వ మార్పు జరుగనుందా? అవుననే వార్తలే పెక్కుమంది కాంగ్రెస్ నేతల నుంచి వినొస్తున్నాయి. ఉపఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చుతారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. 

మఖ్యంగా, ఉపఎన్నికల ఫలితాలు ఇటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత బొత్స సత్యనారాయణకు కత్తిమీద సాములా మారాయని అంటున్నారు. పైపెచ్చు.. 2014 కంటే ముందు జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు రెఫరెండంగా పేర్కొంటున్నారు. 

అలాగే, వైఎస్ఆర్ అభిమాన కాంగ్రెస్ ఎమ్మెల్యపై విప్ ధిక్కరణ కింద అనర్హత వేటు వేస్తే 17 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే మార్చి నెలలో జరిగే ఉపఎన్నికల ఫలితాల ప్రభావం ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికలపై పడుతుంది. ఇది స్థానిక సంస్థలతో పాటు.. 2014 ఎన్నికల్లోనూ కొనసాగే అవకాశాలు లేకపోలేదని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. 

దీనికంతటికీ కారణం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలేనన్నది ఆయన మంత్రివర్గంలోని సీనియర్ మంత్రులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలో బాహాటంగా విమర్శిస్తున్నారు. దీనికి తోడు ఒక వ్యక్తికి ఒక మంత్రి పదవి అనే నినాదం కూడా ఇపుడు రాష్ట్రంలో ఊపందుకుంది. దీంతో బొత్స జోడు పదవుల్లో ఒకదానికి కత్తెర పడే అవకాశం ఉంది. 

పైపెచ్చు.. ఏ చిన్న తప్పు దొర్లినా కిరణ్ వర్గం, బొత్స వర్గంతో పాటు.. తెలంగాణ ప్రాంతానికి చెందిన అసమ్మతి నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అంతటితో ఆగకుండా వారు హస్తినకు క్యూ కట్టి ఫిర్యాదులు చేస్తున్నారు. దీనికి నిదర్శనంగా తెలంగాణకు చెందిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇటీవల ఢిల్లీ పెద్దలను కలిసి బొత్సపై ఫిర్యాదు చేశారు. 

అదేసమయంలో ప్రభుత్వ పరిస్థితిపై పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఒక రహస్య నివేదిక సమర్పించినట్టు సమాచారం. మరోవైపు.. పీసీసీ చీఫ్ బొత్స కూడా స్వయంగా ఢిల్లీ వెళ్లి పలువురు పెద్దలను కలిశారు. ఇలా... ప్రతి సందర్భంలో బొత్స, కిరణ్‌, అసమ్మతి వాదులు రెచ్చిపోతున్నారు. దీంతో ఎవరిది పైచేయి అయిందన్నదానిపై చర్చలు జోరుగానే సాగుతున్నాయి. 

ఈ నేపథ్యంలో ఉపఎన్నికల తర్వాత భారీగా మార్పులు చేస్తామని ఢిల్లీ పెద్దలు చెబుతున్నారంటూ ఓ వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ గుసగుసలు నిజమైతే.. ముఖ్యమంత్రి కిరణ్‌ స్థానంలో నాలుగో కృష్ణుడిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత, మంత్రి కందూరి జానారెడ్డి సీఎం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్టు సమాచారం. 

వీటికి మరింత బలం చేకూర్చోలా ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహా తాజాగా చేసిన వ్యాఖ్యలను చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో కె.జానారెడ్డి వంటి బలమైన నేత మరొకరు లేరంటూ కితాబిచ్చారు. ఇకోపైపు.. పీసీసీ అధ్యక్ష పీఠం నుంచి బొత్సను తొలగించి మరో వ్యక్తిని నియమించాలన్న డిమాండ్ లేకపోలేదు. ఇలాంటి పరిణామాల మధ్య ఏప్రిల్ నెలలో రాష్ట్ర కాంగ్రెస్‌లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.