26 ఫిబ్ర, 2012

అభిమానిపై చేయి చేసుకున్న బాలకృష్ణ

నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ అభిమానిపై చేయి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర వహించడానికి సిద్ధపడుతూ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్న బాలకృష్ణ ఈ విధంగా వ్యవహరించడం చాలా మందికి నచ్చలేదు. అయితే, ఆ తర్వాత ఆ అభిమానితో కలిసి ఫొటో దిగి పరిస్థితిని బాలకృష్ణ చల్లబరిచారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీరామచంద్ర స్వామి దర్శనానికి బాలకృష్ణ వచ్చినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. 

శ్రీరామరాజ్యం సినిమా విజయాన్ని పురస్కరించుకుని నిర్మాత సాయిబాబా, బాలకృష్ణ పూజలు చేయడానికి భద్రాచలం వచ్చారు. బాలకృష్ణకు అభిమానులు అతి సమీపంగా వచ్చారని, ఆయనను అనుసరించారని, ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించారని, దీంతో బాలకృష్ణ చాలా ఇబ్బంది పడి అసహనానికి గురయ్యారని అంటున్నారు. దాంతో బాలకృష్ణ ఎన్టీఆర్ అభిమానిపై చేయి చేసుకున్నారని చెబుతున్నారు. 

అయితే, దెబ్బ తిన్న గుంటుపల్లి రామకృష్ణ ఏమీ బాధపడడం లేదు. తనకు చాలా ఆనందంగా ఉందని, బాలకృష్ణ ఆ తర్వాత తనతో కలిసి ఫొటో దిగారని, దీని ముందు ఆ సంఘటన అంత పెద్దదేమీ కాదని అతను అంటున్నాడు. కొట్టిన తర్వాత సారీ చెప్పి, అభిమాని భుజంపై చేయి వేసి బాలకృష్ణ ఫొటో దిగారు. అభిమానిని కొట్టే ఉద్దేశం బాలకృష్ణకు లేదని ఆయన వెంట ఉన్న తెలుగుదేశం నాయకులు కొడాలి శ్రీనివాస రావు, కోనేరు చిన్ని వంటి నాయకులు అంటున్నారు.