24 ఫిబ్ర, 2012

మోపిదేవి జగన్ పార్టీలో చేరడం లేదు: అంబటి రాంబాబు

గుంటూరు: మద్యం ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ తమ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు బుధవారం గుంటూరు జిల్లాలో అన్నారు. మంత్రి మోపిదేవి జగన్ వర్గీయుడని, ఆ కారణంగానే ఎసిబి రిమాండ్ రిపోర్టులో మంత్రి పేరు చేర్చారనేవి కేవలం పుకార్లేనని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరుడికి మద్యం మద్యం ముడుపులు అందలేదనే ఉద్దేశ్యంతోనే మోపిదేవి ఇతర ఎక్సైజ్ శాఖ అధికారులను టార్గెట్ చేసి ఎసిబి దాడులు నిర్వహింప చేస్తున్నారని ఆరోపించారు. సిండికేట్ల భాగోతం సిఎం కేంద్రంగా నడుస్తున్న వ్యవహారమని, ఎసిబి ఎన్నిడూ పరిధి దాటి వ్యవహరించిన దాఖలాలు లేవని అన్నారు. రిమాండ్ రిపోర్టులో నేతలను తొలగించి అధికారులను బలిచేస్తున్నారన్నారు.

మోపిదేవికి ముడుపులు ఇచ్చినట్టు రమణ ఖరాఖండిగా చెబుతున్నప్పటికీ ఆయనను తొలగించే ధైర్యం సిఎం చేయడం లేదని ఇది సిగ్గుచేటన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జిల్లా విజయనగరంలో దాడులు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. సమాచార హక్కు కమిషనర్ల నియామకంలో సిఎం రాజకీయాలు ప్రదర్శించడం వల్లనే గవర్నర్ ఫైల్ తిప్పి పంపారన్నారు. కమిషనర్ల నియామక ఫైల్ తిరస్కరించడం కాంగ్రెసు, టిడిపిలకు చెంప పెట్టు అన్నారు. వారు కుమ్మక్కయ్యారనేందుకు ఇదే నిదర్సనమన్నారు.