22 ఫిబ్ర, 2012

బెదిరించి భర్తని కిడ్నాప్ చేసిన జెనీలియా

మన్‌ప్రీత్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా హిందీ చిత్రం 'తేరే నాల్‌ లవ్‌ హోగయా'. అందులో వేరొకరితో జరుగబోయే తన పెళ్లి నుంచి తప్పించుకోడానికి రితేష్‌ను కిడ్నాప్‌ చేసే పాత్రలో జెనీలియా నటిస్తోంది. ఈ చిత్రంలో తాను రితేష్‌ను కిడ్నాప్‌ చేస్తే, నిజ జీవితంలో రితేష్‌ తనను కిడ్నాప్‌ చేశాడంటోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ లో జెనీలియా..ఓ తుపాకితో రితీష్ ని బెదిరించి కిడ్నాప్ చేయటం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో వారిద్దరూ తొలుత ఒకరంటే ఒకరు ఇష్టంలేని జంటగా ఉన్నప్పటికీ అనంతరం నెమ్మదిగా ప్రేమలో పడతారు. ఈ చిత్రం క్లైమాక్స్‌ సన్నివేశం అందరికీ ఆసక్తికరంగా ఉంటుందని జెనీలియా తెలిపింది. ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంతో ఈ ఆలుమొగలు కలిసి నటించిన చిత్రాల సంఖ్య మూడుకు చేరుతుంది. 

ఇక తన భర్త రితేష్‌తో కలిసి నటిస్తున్న 'తేరే నాల్‌ లవ్‌ హోగయా' తాజా హిందీ చిత్రం ప్రమోషన్‌ పనిలో నిమగ్నమైన జెనీలియా ప్రస్తుతం కాస్త బిజీగా ఉంది. జీవితంలో రితేష్‌ను పొందడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. తన జీవితంలో అతనొక ఒక పెద్ద గిప్ట్ అని కూడా చెబుతోంది. అతను ఆమె కలల రాకుమారుడట. ఎనిమిది సంవత్సరాల పాటు అతనితో సాగించిన ప్రేమాయణం జీవితంలో ఓ మధురమైన ఘట్టం అంటోంది. రితేష్‌ చాలా బుద్ది మంతుడు అంటూ అతని వ్యక్తిత్వాన్ని జెనీలియా మెచ్చుకుంటోంది. ఇక నుంచి కేవలం రితేష్‌తోనే నటించాలో, సంవత్సరంలో ఎన్ని చిత్రాలలో నటించాలో వంటి విషయాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదంటోంది శ్రీమతి జెనీలియా. ఇక త్వరలో ఆమె రానా సరసన నటించిన నా ఇష్టం చిత్రం విడుదల కాబోతోంది. తెలుగులో ఆరెంజ్ తర్వాత ఆమె నటించిన చిత్రం ఇదే.