16 ఫిబ్ర, 2012

జగన్ రాజకీయ శత్రువే, సందేహాలు వద్దు: ముఖ్యమంత్రి

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షడు వైయస్ జగన్ తమకు శత్రువేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్ఫష్టం చేశారు. టిడిపి ఎంతటి శత్రువో, జగన్ కూడా అంతటి శత్రువేనని, ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశంలో ఆయన పార్టీ శాసనభ్యులకు గురువారం సాయంత్రం మార్గనిర్దేశం చేశారు. వైయస్ జగన్‌పై ఎందుకు మెతగ్గా వ్యవహరిస్తున్నారని కొంత మంది శాసనసభ్యులు కిరణ కుమార్ రెడ్డిని, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను నిలదీశారు. పార్టీని వదిలి వెళ్లిన తర్వాత జగన్‌ను రాజకీయ శత్రువుగానే చూడాలని, ఇందులో ఎవరికీ ఏ విధమైన సందేహాలు అవసరం లేదని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమకు రాజకీయ ప్రత్యర్థేనని ఆయన అన్నారు. 

పార్టీని బలహీనపరిచేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారని, దీనిపై మూడు నాలుగు రోజుల్లో చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. తమకు మద్దతు పలికే మీడియా లేదని ఆయన అన్నారు. ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేక వార్తలను ఖండించడానికి నలుగురు మంత్రులతో ఓ కమిటీ వేస్తామని ఆయన చెప్పారు. శాసనసభ్యులు విధిగా సభకు హాజరు కావాలని ఆయన సూచించారు. సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలని, మంత్రులను అడిగి విషయాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. 

రాష్ట్రానికి వచ్చే రైల్వే ప్రాజెక్టుల పెట్టుబడుల్లో సగం వాటా భరిస్తామని ఆయన చెప్పారు. వరి మద్దతు ధరకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రానికి లక్షా 25 వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ రంగ సంస్థలు వస్తున్నాయని, ఇందులో 25వేల కోట్లు రక్షణ రంగ సంస్థలకు సంబంధించినవేనని ఆయన అన్నారు. శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత సహకార సంఘాల ఎన్నికలు ఉంటాయని, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని ఆయన చెప్పారు. ఈ రెండు ఎన్నికలు పూర్తయిన తర్వాత పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల విభజన జరుగుతుందని ఆయన చెప్పారు.