28 ఫిబ్ర, 2012

పైరసీతోనే రామ్ గోపాల్ వర్మ పైకొచ్చాడట

ప్రముఖ దర్సక, నిర్మాత రామ్ గోపాల్ వర్మకు అందరితో పాటు నడవడం చేత కాదనిపిస్తోంది. ప్రపంచమంతా ఒక రకంగా ఆలోచిస్తే ఆయన మరో రకంగా ఆలోచిస్తారు. తలకిందుల వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటే. తాజాగా, ఆయన మరో సంచలన వ్యాఖ్య చేశాడు. తాను వీడియో పైరసీకి పాల్పడే పైకొచ్చానని మొహమాటం లేకుండా చెప్పుకున్నాడు. హైదరాబాద్‌లో వీడియో క్యాసెట్లు అద్దెకిచ్చే షాపు నడిపినప్పుడు తాను కూడా ఇలాగే పైరేటెడ్ క్యాసెట్లు తయారుచేసి, అద్దెకిచ్చి సొమ్ము చేసుకున్నానని, దానివల్లే తనకు ఆర్థిక స్థిరత్వం వచ్చిందని ఏ మాత్రం తొణక్కుండా ట్వీట్ చేశాడు.

ఆర్థికంగా వెసులుబాటు లభించడం వల్లనే సంపాదన సంగతి పక్కనపెట్టి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించి పైకి రాగలిగానని తన ట్విట్టర్ ఖాతాలో వివరంగా రాశారు. తానూ ఒకప్పుడు 'పైరేట్' కాబట్టి తన సానుభూతి వారికి ఉంటుందన్నారు. ఇలాగే మరో ఇంటర్వ్యూలో.. ట్విట్టర్‌తో ఎక్కువసేపు గడపడం అంత మంచిది కాదని సాక్షాత్తూ ఆ సైట్ సహవ్యవస్థాపకుడే హెచ్చరించారు కదా అని ప్రశ్నిస్తే.. ట్వీటింగ్ కూడా సృష్టికార్యం అంత మంచిదని సెలవిచ్చారు. సాధారణంగా జనం తమ ఆరోగ్యానికి ఏది మంచిది కాదో దాన్నే కోరుకుంటారని సూత్రీకరించారు