22 ఫిబ్ర, 2012

ఏసుక్రీస్తునే మించిపోయా.. జింబాబ్వే అధ్యక్షుడి జోకులు

జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే తనపై తానే జోకులేసుకుంటున్నారు. పనిలో పనిగా తాను విశ్వసించే దైవం ఏసుక్రీస్తుపై కూడా జోకులను పేలుస్తున్నారు. ఈ 88 ఏళ్ల జింబాబ్వే పాలకుని ఆరోగ్యంపై ఇటీవలి కాలంలో పలు కథనాలు వెల్లువెత్తాయి. 

వృద్ధాప్యంలో ఉన్న రాబర్ట్ ముగాబేను పలు రకాల అనారోగ్యాలు చుట్టుముట్టాయని, ప్రస్తుతం ఆయన కేన్సర్‌తో బాధపడుతున్నందున ఇక ఎంతోకాలం బతకరని ఆ కథనాల సారాంశం. దీన్ని తేలిగ్గా కొట్టిపారేస్తున్న ముగాబే, తాను ఇప్పటికే పలుమార్లు చనిపోయి బతికానంటూ, ఈ విషయంలో తాను ఏసుక్రీస్తు రికార్డును కూడా అధిగమించేశానంటూ జోకులేస్తున్నారు. 

88వ పుట్టిన రోజు జరుపుకుంటున్న రాబర్ట్, తమ దేశ రేడియోకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఫిడేలు(ఒక రకమయిన వాయిద్యం) మాదిరి నిక్షేపంగా ఉన్నానంటూ దేశ ప్రజలకు చెప్పారు. వ్యక్తిగతంగా రోమన్ కేథలిక్ అయిన రాబర్ట్ తన ఆరోగ్యంపై వస్తున్న కథనాలను తేలిగ్గా తీసిపారేసారు. 

"నేను ఇప్పటికి పలుమార్లు చనిపోయి మళ్లీ బతికాను... కానీ భగవంతుడు ఏసుక్రీస్తు కేవలం ఒకసారే చనిపోయాడు.. ఒకసారే తిరిగి లేచారు.. కాబట్టి ఆయన కన్నా నేనే గొప్ప" అంటూ వ్యాఖ్యానించారు. ఐదు కాదు పది కాదు ఏకంగా ముప్ఫయి రెండేళ్ల పాటు అధికారం వెలగబెట్టిన ఈ పెద్దాయనకు ఇపుడు తీరిగ్గా ఎన్నికలు గుర్తుకొచ్చాయి. 

వచ్చే ఏడాది (2013)లో ఎన్నికలు జరిపించాలనుకుంటున్నారు. దేశ ప్రధానమంత్రి, రాబర్ట్‌కు చిరకాల ప్రత్యర్థి అయిన మోర్గాన్ స్వాంగిరై మాత్రం రానున్న ఎన్నికలకన్నా ముందే కొత్త రాజ్యాంగం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇంత వృద్ధాప్యంలో కూడా తాను ఇలా రాయిలా నిక్షేపంగా ఉన్నారనే దానికి కారణాలను కూడా ఆయన వెల్లడించారు. ఆయన ఆల్కహాల్ సేవించరట! ప్రతిరోజు వ్యాయామం చేయడం, కూరగాయలు, పండ్లతో చేసిన ఆహారాన్ని తీసుకోవడమే ఆయన ఆరోగ్య రహస్యం అని ఇంటర్వ్యూలో చెప్పారు.