26 ఫిబ్ర, 2012

ప్రియమణితో మల్లిగాడు

‘‘కార్తీ తమిళంలో మాత్రమే కాదు.. తెలుగులో కూడా స్టార్ హీరో అయ్యారు. ‘పరుత్తివీరన్’లో గొప్పగా నటించారు. ఇదొక అద్భుతమైన ప్రేమకథ. ఏ నేటివిటీకైనా సూట్ అవుతుంది. తెలుగులో కూడా ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాం’’ అని రాజమౌళి, శ్రీను వైట్ల, బెల్లంకొండ సురేష్, గణేష్‌బాబు అన్నారు. కార్తీ, ప్రియమణి జంటగా తమిళంలో రూపొందిన ‘పరుత్తివీరన్’ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా సమర్పణలో ఆర్. తంగప్రభాకరన్ తెలుగులో ‘మల్లిగాడు’ పేరిట అందిస్తున్నారు.

హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో అతిథులుగా పాల్గొన్న అతిథులు పై విధంగా స్పందించారు. ఇంకా ఈ వేడుకలో తమన్, మల్లిడి సత్యనారాయణ, ‘మధుర’ శ్రీధర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రచయిత శశాంక్ వెన్నెలకంటి మాట్లాడుతూ -‘‘కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ఇది సినిమానా? నిజంగా జరుగుతోందా? అనిపిస్తుంది. ఈ సినిమా అలానే ఉంటుంది. ఈ చిత్రంలో తన పాత్రకు గోదావరి యాసలో కేవలం మూడు రోజుల్లో కార్తీ డబ్బింగ్ చెప్పడం అభినందనీయం’ అన్నారు. కార్తీ మాట్లాడుతూ -‘‘ఈ సినిమా నాకు ప్రత్యేకం. 

పేమాభిషేకం, మరోచరిత్రలాంటి సినిమా ఈ ‘మల్లిగాడు’. నాకిది మొదటి సినిమా. కానీ ప్రియమణికి ఐదు సినిమాల అనుభవం ఉంది. తన ముందు తేలిపోతానేమో అనుకున్నాను. కానీ మల్లిగాడు పాత్రకు న్యాయం చేయగలిగాను. ప్రియమణి అద్భుతంగా నటించింది. జాతీయ అవార్డ్ కూడా సాధించింది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉన్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందిస్తున్నందుకు జ్ఞానవేల్‌రాజా, తంగ ప్రభాకరన్ తమ ఆనందం వ్యక్తం చేశారు. రాజమౌళి సీడీని ఆవిష్కరించి శ్రీను వైట్లకు ఇచ్చారు. మధుర ఆడియో ద్వారా ఈ పాటలు విడుదలయ్యాయి.