22 ఫిబ్ర, 2012

పెళ్లి రిసెప్షన్: బాబు ధర్మాన వాగ్వాదం, సిఎం జోక్యం

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సభలో మాట్లాడుతున్న సమయంలో మంత్రి ధర్మాన ప్రసాద రావుకు, ఆయనకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చంద్రబాబు మాట్లాడుతూ.. మంత్రి ధర్మాన ప్రసాద రావు తన తనయుడు రిసెప్షన్ కోసం విఆర్వో పరీక్షా కేంద్రాన్ని మార్చారన్నారు. అందుకు ధర్మాన స్పందించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పూర్తి వివరాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. విషయం తెలియకుండా సిపిఐ నారాయణలా మీడియాకు ఎక్కేందుకు మాట్లాడవద్దని అన్నారు. ఓ ప్రతిపక్ష నేతగా తెలుసుకొని మాట్లాడతారని భావించానని అన్నారు. కొంతకాలంగా అందరూ పేపర్ చూసి మాట్లాడటం నేర్చుకున్నారని విమర్శించారు. అది సరికాదన్నారు. రిసెప్షన్ కోసం దానిని తాము నవంబరులోనే నిబంధనల మేరకు బుక్ చేసుకున్నామని చెప్పారు. కానీ విఆర్వో సెంటర్ మార్చారని ప్రతిపక్ష నేత తనకు ఆపాదించారని అందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మద్యం సిండికేట్ల వ్యవహారంపై ఎర్రన్నాయుడి తమ్ముడితో బాబు మాట్లాడాలన్నారు. బాబు ప్రతిపక్షంలో కూర్చుంటే ఓ మాట అధికారంలో ఉంటే మరో మాట మాట్లాడుతున్నారన్నారు.

అందుకు బాబు... రిసెప్షన్ కోసం అనుమతి పొందారో లేక రికార్డులు సృష్టించారో ఎవరికి తెలుసునన్నారు. నూతన దంపతులకు తాను అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. అయితే ఒకరి పెళ్లి మరొకరికి చావు కావొద్దన్నారు. గట్టిగా మాట్లాడినంత మాత్రన తప్పు ఒప్పుకాదన్నారు. పబ్లిక్ ఇంట్రస్టు కోసం పర్సనల్ ఇంట్రెస్టును ఎందుకు వదులుకోలేదన్నారు. బాబు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ.. మన సహచరుడి తనయుడి పెళ్లిని ఉద్దేశ్య పూర్వకంగా కాంట్రవర్సీ చేయవద్దని సూచించారు. ఇది సరి కాదన్నారు. ఓ ఆంగ్ల ఛానల్ తెలియకుండా వార్త రాస్తే దానిని ప్రస్తావించడం సరికాదన్నారు. పెళ్లిని కూడా కాంట్రవర్సీ చేయడం నీచం అన్నారు. అనంతరం బాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... డిఎస్సీకి టెట్ ఎందుకని ప్రశ్నించారు. అర్హత ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలి తప్ప అభ్యర్థులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు.