20 ఫిబ్ర, 2012

పద్మనాభుడి అనంత సంపద లెక్కింపు ప్రారంభం

కొచ్చిన్: కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో వెలుగు చూసిన అనంతమైన సంపద లెక్కింపు సోమవారం ప్రారంభమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ లెక్కింపు జరుగుతోంది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఐదు నేల మాళిగల్లో అంతు లేని సంపద బయటపడిన విషయం తెలిసిందే. సంపద విలువ 100 వేల కోట్ల మేరకు ఉంటుందని అనధికారిక అంచనా. 

అనంత పద్మనాభ స్వామి ఆరో నేలమాళిగను తెరవాల్సి ఉంది. అయితే, దీని చుట్టూ వివాదాలు, ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఐదు నేల మాళిగల్లో బయటపడిన సంపదను లెక్కించిన తర్వాత ఆరో నేలమాళిగను తెరిచే విషయంపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వెలువరిస్తుంది. ప్రపంచంలోని అత్యంత సంపద్వంతమైన అనంత పద్మనాభుడి సంపద లెక్కింపుతో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. 

లెక్కింపును డిజిటలైజ్ చేయడానికి ప్రత్యేక యంత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. సంపద డిజిటల్ డాక్యుమెంటేషన్‌లు నెలలు పట్టే అవకాశాలున్నందున ఆలయం సంప్రదాయాచరణలకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులను ఎప్పటిలాగే దర్శనానికి అనుమతిస్తారు.