23 ఫిబ్ర, 2012

ఆరేళ్ల తర్వాత హిట్ చూశా: సిద్ధార్థ

సుమారు ఆరేళ్ల తర్వాత తను నటించగా ఏకగ్రీవంగా హిట్ టాక్ వచ్చిన సినిమా 'లవ్ ఫెయిల్యూర్' అని హీరో సిద్ధార్థ్ అన్నారు. మంగళవారం సాయంత్రం ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన ఆ సినిమా సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. "చాలా మంచి సినిమా అని అందరూ అంటున్నారు. ఇంతదాకా బాలాజీ వంటి క్లారిటీ ఉన్న డైరెక్టర్‌తో నేను పనిచేయలేదు. బాగుంటే కొత్త తరహా సినిమా ఆదరిస్తామని తెలుగు ప్రేక్షకులు నిరూపించారు. ఈ సినిమాకి మరో హీరో తమన్. మంచి బాణీలిచ్చాడు. పార్వతి పాత్ర చెయ్యడం సులువు కాదు. అమల గొప్పగా చేసింది. నిర్మాత బెల్లంకొండ సురేశ్ సహకారం మరచిపోలేనిది. ఇది చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించడంలో నా మిత్రుడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చక్రవర్తి రామచంద్ర భాగస్వామ్యం ఎంతో ఉంది. నా తదుపరి చిత్రానికి అతనే నిర్మాత'' అని ఆయన అన్నారు.

దర్శకుడు బాలాజీ మోహన్ మాట్లాడుతూ - "రెండు భాషల్లోనూ ఇంత మంచి రెస్పాన్స్ ఊహించలేదు. మంచి సబ్జెక్టునీ, కొత్త ఆలోచనల్నీ జనం ఆదరిస్తారని రుజువైంది'' అన్నారు. చిత్ర సమర్పకుడు బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ "హైదరాబాద్‌లో మొదటి వారం 15 థియేటర్లలో ఆడుతున్న ఈ సినిమా రెండో వారం 25 థియేటర్లలో ఆడబోతోంది. యువతకీ, ఫ్యామిలీ ప్రేక్షకులకీ బాగా నచ్చుతోంది'' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శశికాంత్, నటుడు సురేశ్, హీరోయిన్ అమలా పాల్ మాట్లాడారు.