26 ఫిబ్ర, 2012

కోవూరులో పోటీ చేస్తాం, ప్రచారానికి వెళ్తా: కెసిఆర్

హైదరాబాద్: నెల్లూరు జిల్లా కోవూరు స్థానంలో తమ పార్టీ అభ్యర్థిని పోటీకి దించుతామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారు. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఆంధ్రవాళ్లు తెలంగాణలో పోటీ చేస్తున్నప్పుడు తాము సీమాంధ్రలో ఎందుకు పోటీ చేయకూడదని ఆయన అడిగారు. మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయని, ఒకరి పేరు ఖరారు చేసి బి - ఫారం ఇస్తామని ఆయన చెప్పారు. తాను కోవూరులో ప్రచారానికి కూడా వెళ్తానని ఆయన చెప్పారు. 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆస్తులు ఎక్కడున్నాయో ఆధారాలతో నిరూపిస్తానని కె. చంద్రశేఖర రావు అన్నారు. చంద్రబాబునాయుడిపై తీవ్రంగా మండిపడ్డారు. తనకు 70 ఎకరాల భూమి ఉందని నిరూపిస్తే ఏ త్యాగానికైనా సిద్ధమేనని ఆయన అన్నారు. వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది చంద్రబాబే అని ఆయన అన్నారు. తనకు 24 ఎకరాల భూమి మాత్రమే ఉందని ఆయన అన్నారు. తనను అప్రతిష్టపాలు చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. తనకు 70 ఎకరాలు భూమి ఉందని రుజువు చేయలేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని ఆయన అడిగారు. బెల్టు షాపుల సృష్టికర్త చంద్రబాబే అని, ఇప్పుడు మద్యం సిండికేట్ల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. ఢిల్లీలో సుజనా చౌదరి అతిథి గృహంలో చంద్రబాబు కేంద్ర హోం మంత్రి చిదంబరాన్ని రహస్యంగా కలుసుకున్నారని ఆయన చెప్పారు. 

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ దక్కే పరిస్థితి కూడా లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత దేవేందర్ గౌడ్ బుడ్డర్ ఖాన్ వంటివాడని ఆయన వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో తమ ఓట్లు తగ్గించే కుట్రకు చంద్రబాబు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు చరిత్ర, వ్యవహారం తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయిందని ఆయన అన్నారు. రెండెకరాల ఆసామి భార్య అయిన చంద్రబాబు తల్లి అమ్మన్నమ్మ 50 లక్షల రూపాయలు పెట్టి ఎలా భూమి కొని లోకేష్‌కు ఎలా ఇచ్చిందని ఆయన అడిగారు. ఆమెకు అ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ బ్యాంకు నుంచి తెచ్చారని ఆయన అడిగారు. తెలంగాణకు ప్రధాన శత్రువు చంద్రబాబేనని ఆయన అన్నారు. చంద్రబాబు భార్య అస్తులు తాను బయపెడతానని ఆయన అన్నారు.