24 ఫిబ్ర, 2012

ఒకే కుటుంబంలో ఏడుగురికి జీవితఖైదు

తన ఇంటి వద్ద చెత్త వేయొద్దని కోరినందుకు ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేసిన ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి ఢిల్లీ హైకోర్టు గురువారం జీవితఖైదు విధించింది. ఒక్కొక్కరికి రూ.35 వేల చొప్పున జరిమానా కూడా వేసింది. అజయ్‌ ఉత్తర ఢిల్లీలో నివసిస్తున్నారు. అతని ఇంటి ఎదురుగా అనిల్‌, అనార్‌, రాజ్‌ శైలేంద్ర, ఆనంద్‌, ధర్మపాల్‌, అశోక్‌, ఆశా ఉంటున్నారు. తన ఇంటి వద్ద చెత్త వేయడం వల్ల ఇబ్బందిగా ఉంటోందని అలా చేయొద్దని అజయ్‌ 2005 సెప్టెంబరు 3న వారిని వారించాడు. దీంతో వారంతా కత్తులు, ఇనుప రాడ్లతో దాడిచేసి మృతిచెందే వరకు కొట్టారు. అజయ్‌ తలపై అశోక్‌ కత్తితో దాడిచేయగా అతని భార్య ఆశా మళ్లీ మళ్లీ పొడవాలంటూ ప్రోత్సహించింది. దాడిలో అజయ్‌ భార్య మీను, బంధువు విమల కూడా గాయపడ్డారు. ఘటన జరుగుతున్నప్పుడు మేడపై ఉన్న అజయ్‌ కుమారుడు (మైనర్‌) కోర్టులో సాక్ష్యం చెప్పి దాడి చేసిన వారిని గుర్తించాడు. ఘటన సమయంలో తండ్రిని చంపొద్దని తాను అరుస్తూనే ఉన్నానని, అయినా నిందితులు ఉపేక్షించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. సాక్ష్యాన్ని విశ్వసించిన కోర్టు నిందితులకి జీవితఖైదు విధించింది