26 ఫిబ్ర, 2012

సోనియా - రాహుల్‌లకు నైతికత లేదు : టీమ్ అన్నా బృందం

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీలపై అన్నా హజారే బృందం మండిపడింది. వారిద్దరికి ఏమాత్రం నైతికత లేదని ఆరోపించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించే వారు.. ఢిల్లీకి వచ్చి పొగడ్తల వర్షం కురిపిస్తున్నారని ఆరోపించారు. 

ఈ అంశంపై ఆదివారం టీమ్ అన్నా సభ్యుడు మనీష్ సిసోడియా మాట్లాడుతూ సోనియా, రాహుల్ గాంధీలకు నైతికత లేదన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి, ఎస్పీ అధినేత ములాయం సింగ్‌లను తిట్టి.. ఢిల్లీ వారిని పొగడ్తలతో ముంచెత్తుతుందని విమర్శించారు. 

మరోవైపు.. మతం పేరుతో దేశాన్ని నిట్టనిలువునా భారతీయ జనతా పార్టీ చీల్చేందుకు కుట్ర పన్నిందన్నారు. రాజకీయ పార్టీలన్నీ నైతికతను పాటించడం లేదన్నారు. అన్నా ఉద్యమ కార్యక్రమాలపై ఎస్‌ఎమ్‌ఎస్ రూపంలో ప్రజలకు వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తామన్నారు.