21 ఫిబ్ర, 2012

చిరంజీవి గెస్ట్ రోల్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత గణేష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ‘గబ్బర్ సింగ్‘ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హారిష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ బాబు శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో చిరంజీవి గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారని, పవర్ స్టార్‌తో కలిసి ఓ పాటలో స్టెప్పులు వేయనున్నాడని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై గణేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి గెస్ట్ రోల్ గానీ, పాటలో స్టెప్పులు వేయడం కానీ చేయడం లేదని స్పష్టం చేశారు. మెగా బ్రదర్స్‌ను ఒకే సినిమాలో కలిసి చూద్దామని ఇప్పటి వరకు ఆశగా ఉన్న అభిమానులు....గణేష్ బాబు ప్రకటనతో ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు.

ప్రస్తుతం గబ్బర్ సింగ్ చిత్రం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘దబాంగ్’ చిత్రానికి ఇది రీమేక్. 

ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంలో నటించనున్నాడు. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన కాజల్ ఎంపికైనట్లు తెలుస్తోంది. మేలో షూటింగ్ ప్రారంభం అయి, దసరా నాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.