12 ఫిబ్ర, 2012

విడిపోయినప్పటికీ భర్త ఇంట్లో భార్యకు హక్కుంటుంది: సుప్రీం


భర్త నుండి విడిపోయినప్పటికీ, భార్యకు తన భర్తతో కలిసి జీవించే హక్కుంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. భర్త నుండి జీవనం కొనసాగించేందుకు అవసరమయిన ఖర్చులను కూడా ఆమె గృహ హింస నిరోధక చట్టం కింద పొందే అధికారం ఆమెకుంటుందని చెప్పింది. ఈ చట్టాన్ని రూపొందించడానికి ముందే విడిపోయిన భార్యాభర్తలకు కూడా ఇదే రూలు వర్తిస్తుందంది.

దేశ రాజధానిలో కోర్టుకెక్కిన ఇద్దరు దంపతుల మధ్య చెలరేగిన వైవాహిక సమస్యను విచారిస్తూ న్యాయమూర్తులు అల్తమాస్ కబీర్, జె. చలమేశ్వర్లతో కూడిన ధర్మాసనం ఒక రూలింగ్‌ను జారీ చేసింది. గతంలో భర్తతో జీవించి ఉండి, ఆ తర్వాత పలు కారణాల వల్ల అతని నుండి విడిపోయినప్పటికీ, ఆ భార్యకు గల హక్కులు పోవని న్యాయమూర్తులు చెప్పారు. గృహ హింస నిరోధక చట్టం-2005 కింద ఆమె తన హక్కులను కాపాడుకోవచ్చన్నారు.

వి.డి.భానోత్, సవితా భానోత్ అనే దంపతులకు ముప్ఫయేళ్ల క్రితం వివాహమయింది. చాలా కాలం కలిసి ఉన్నతర్వాత వారు కొన్ని అభిప్రాయ బేధాల కారణంగా 2005వ సంవత్సరంలో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత సవితా భానోత్ తన భర్తకు చెందిన నివాసంలో కొంత భాగాన్ని తనకు కేటాయించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 

న్యాయస్థానం ఈ కేసును విచారిస్తూ, భార్య విడిపోయినప్పటికీ, భర్తతో తన వైవాహిక హక్కులను కోల్పోదని చెప్పింది. వి.డి.భానోత్ తన గృహంలో, కొంత భాగాన్ని తన భార్య సవితా భానోత్‌కు కేటాయించాలని, అందులో ఆమె గౌరవప్రదంగా జీవించే ఏర్పాట్లను చేయాలని సూచించింది.