22 ఫిబ్ర, 2012

దాడికి పాల్పడ్డ టాప్ హీరో, అరెస్టు చేసే అవకాశం?

బాలీవుడ్ టాప్ హీరో సైప్ అలీఖాన్ మరోసారి ఇబ్బందుల్లో పడ్డాడు. ఓ వ్యక్తిపై దాడి చేసిన కేసులో ఆయన అరెస్టయి జైలుకెళ్లే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే...

సైప్ అలీఖాన్-కరీనా కపూర్ జంటగా నటించిన ‘ఏజెంట్ వినోద్’ చిత్రం మార్చి 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనుల్లో భాగంగా మంగళవారం రాత్రి తాజ్ హోటల్ కు వచ్చిన సైఫ్..ఇక్భాల్ శర్మ అనే వ్యక్తిపై దాడి చేశాడు. పిడిగుద్దులతో అతని ముఖంపై గాయం చేశాడు. దీంతో శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సైఫ్ అలీఖాన్ పై ఇండియన్ పీనల్ కోడ్ 325 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఇలాంటి కేసుల్లో జైలు శిక్ష అనుభవించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

సైఫ్ అలీఖాన్ ఇలాంటి చర్యలకు పాల్పడటం ఇప్పుడు కొత్తేమీ కాదు. 2008లో ఒకసారి ఇదే తరహాలో ఓ ఫోటో జర్నలిస్టుపై దాడి చేశాడు. అయితే అప్పట్లో సైఫ్ కు, ఫోటో గ్రాఫర్ కు మధ్య కొందరు రాజీ కుదర్చడంతో వివాదం సద్దుమనిగింది. మరి ఈ సారి ఏం జరుగుతుందో చూడాలి.