28 ఫిబ్ర, 2012

కాజల్‌ కీబోర్డ్‌ లాంటిది అంటున్న దర్శకుడు

కాజల్‌ కీబోర్డ్‌ లాంటిది. ఒక్కో మీటకి ఒక్కో రాగం పలికించగల సృజనశీలి అంటున్నారు ప్రముఖ దర్శకుడు కె.వి.ఆనంద్‌. ఆయన సూర్య,కాజల్ కాంబినేషన్ లో రూపొందిస్తున్న తాజా చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే..వాస్తవ సంఘటనలతో అల్లుకున్న చిత్రమిది. అందరికీ నచ్చేలా ఉంటుంది. ఎలాంటి పాత్రనైనా పోషించగల సత్తా ఉన్న నటుడు సూర్య. ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. ఇక కాజల్ మాట్లాడుతూ...ఈ చిత్రం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. సూర్యతో పనిచేయడం మర్చిపోలేనని కాజల్‌ చెప్పింది. 

హీరో సూర్య మాట్లాడుతూ ... ప్రేక్షకులకి వినోదాన్ని పంచుతూనే ఆలోచింపచేసే చిత్రమిది. 'అయ్యన్‌'లో దేవా పాత్రతో నా కెరీర్‌లో ఓ గొప్ప పాత్రని అందించారు కె.వి.ఆనంద్‌. తొలిసారి నాకు ఫొటో షూట్‌ చేసింది కూడా ఆయనే. మా కలయికలో వస్తున్న ఈ కొత్త చిత్రం కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. ప్రతిభగల దర్శకులందరినీ కలిపితే కె.వి.ఆనంద్‌ తయారయ్యారు. ఈ చిత్రంతో తొలిసారి తెలుగులో స్వయంగా డబ్బింగ్‌ చెప్పడం ఆనందంగా ఉందని అన్నారు.

ఈ చిత్రానికి తెలుగులో 'డూప్లికేట్‌' అనే పేరును ఖరారు చేసే అవకాశముంది. కె.వి.ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రైట్స్ ని బెల్లంకొండ సురేష్ చేజిక్కించుకున్నారు. కెవి ఆనంద్ గతంలో జీవా హీరోగా రూపొందిన చిత్రం తెలుగులో 'రంగం'టైటిల్ తో విడుదల చేస్తే మంచి విజయం సాధించింది. అదే స్పూర్తితో సూర్యకి,కెవి ఆనంద్ కి ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని వేసవవిలో భారీగా విడుదల చేయాలని బెల్లంకొండ నిర్ణయించుకున్నారు. సూర్య చిత్రాలు తెలుగులో గతంలో ఇక్కడ మంచి విజయం సాధించటంతో ఈ చిత్రానికి మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.